హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నేపాల్–చైనా సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఈ విపత్తు కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రయాణికులు, యాత్రికుల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాజా సమాచారం ప్రకారం తెలంగాణకు చెందిన 23 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్ అధికారులు వెల్లడించారు. తాజాగా మణికొండకు చెందిన 37 ఏళ్ల ధన్‌పాల్ రెడ్డి కూడా గల్లంతైన వారి జాబితాలో చేరారు. కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆయనను సంప్రదించలేకపోవడంతో అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం.అయితే ఇదే సమయంలో కొంత ఊరటనిచ్చే సమాచారం కూడా వెలువడింది. తెలంగాణతో సంబంధం ఉన్న రవీందర్ రెడ్డి కుంభం, అల్లి ఇలేశా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో వారి కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం లభించింది.
ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు…
Also Read: ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపులు.. డీప్‌ఫేక్ వీడియోల పేరుతో డబ్బుల డిమాండ్
నేపాల్‌లో చిక్కుకుపోయిన లేదా ఆచూకీ తెలియని తెలంగాణ వాసుల వివరాలను సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. తెలంగాణ భవన్ అధికారులు భారత విదేశాంగ శాఖ, కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గల్లంతైన వారి వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు తమ బంధువుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో చివరిగా ఉన్న ప్రాంతం, టూర్ ఆపరేటర్ వివరాలు తదితర సమాచారాన్ని అధికారులకు అందించాలని సూచించారు.
కుటుంబాల్లో తీవ్ర ఆందోళన…
Also Read: ‘ది ప్యారడైజ్’ నుంచి మాస్ ట్రీట్.. డల్లాస్‌లో ‘యేష నాగుల’ లైవ్ పెర్ఫార్మెన్స్!
వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో తమ వారు సురక్షితంగా ఉన్నారా లేదా అనే ఆందోళన కుటుంబాల్లో నెలకొంది. మరోవైపు నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రతికూల వాతావరణం, దెబ్బతిన్న రహదారులు, కమ్యూనికేషన్ సమస్యలు సహాయక బృందాలకు సవాళ్లుగా మారాయి. నేపాల్‌లో జరిగిన ఈ భారీ విపత్తులో మొత్తం మరణాలు, గల్లంతైన వారి సంఖ్య భారీగా ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గల్లంతైన 23 మంది ఆచూకీ కోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలు, భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తోంది. వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
