-నిధుల కేటాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్.. ఎమ్మెల్యేకు నియోజకవర్గ ప్రజల మద్దతు
-ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ చర్చకు తెర.. మిగతా ఎమ్మెల్యేలు కూడా గొంతు కలుపుతారా?
క్రైమ్ మిర్రర్, మునుగోడు:- అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సింహగర్జన చేస్తున్నారు. నియోజకవర్గానికి నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలో ఉంటూనే ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఆయన తీరుకు మునుగోడు నియోజకవర్గ ప్రజల నుంచి మద్దతు లభిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.ఇదిలా ఉండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులపై ఇలాంటి అసంతృప్తే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్న పోరాటానికి ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా మద్దతుగా నిలుస్తారా? ఆయన బాటలో నడుస్తారా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఒకవేళ జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా నిధుల కేటాయింపుల అంశంపై ఏకతాటిపైకి వస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల అసంతృప్తిని గుర్తించి, నియోజకవర్గాల వారీగా నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనులపై స్పష్టత ఇవ్వాలని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.ప్రభుత్వం ఈ అసంతృప్తిని సకాలంలో పరిష్కరించకపోతే భవిష్యత్తులో రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
