-
జగన్మోహన్ రెడ్డి కీలక ప్రతిపాదన
-
పునరాలోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి వైసీపీలో చేరుతారా? ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయా? జగన్మోహన్ రెడ్డి తో కలిసి పని చేసేందుకు ఆయన సిద్ధపడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రఘువీరారెడ్డి గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. షర్మిల తీరుపై ఆగ్రహంగా ఉన్న ఆయన వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి సైతం సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రఘువీరారెడ్డి వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
సుదీర్ఘ నేపథ్యం..
రఘువీరారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్ పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగుతూ వస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పార్టీని వీడలేదు కూడా. 1985లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో మడకశిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో మాత్రం ఓడిపోయారు. 1999లో మరోసారి గెలిచారు. 2004 ఎన్నికల్లో గెలిచి వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఈసారి కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖను నిర్వర్తించారు మరోసారి. అటు తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో సైతం మంత్రిగా వ్యవహరిస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2023 నుంచి మాత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా జాతీయ కార్యవర్గంలో కొనసాగుతూ వస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ లోనే..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న రఘువీరారెడ్డి ఏమంత క్రియాశీలకంగా లేరు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మిగిలి ఉన్న సీనియర్లను తెచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం పెద్దగా పుంజుకోవడం లేదు. జాతీయస్థాయిలో కూడా పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. అందుకే రఘువీరారెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారంలో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.