క్రైం మిర్రర్ : మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. హనుమకొండ నుంచి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. ఆదివారం ఉదయం ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యురాలు డాక్టర్ మమత రెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స అందించారు. పరీక్షల్లో గుండె సంబంధిత సమస్యతో పాటు రక్తనాళాల్లో గడ్డలు (క్లాట్స్) ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, మెరుగైన చికిత్స అవసరమని సూచించారు. దీంతో ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించేందుకు యశోద ఆస్పత్రికి రిఫర్ చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యులతో, పార్టీ నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావును పరిస్థితిని సమీక్షించి కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ ఎమ్మెల్యే అస్వస్థత వార్త సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాపించడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోహిణి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తున్న సమయంలో కూడా పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో నిపుణుల వైద్య బృందం పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వైద్య బులెటిన్ వెలువడాల్సి ఉంది.
also read : మిస్సింగ్ మిస్టరీకి తెర.. చత్తీస్‌గఢ్‌లో క్షేమంగా లభించిన ముగ్గురు బాలికలు
