-
తేల్చి చెప్పిన ప్రశాంత్ కిషోర్
-
కృతజ్ఞతలు లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి
-
పార్టీ కోసం కృషిచేసిన షర్మిల
-
తల్లి విజయమ్మ పరిస్థితి ఘోరం
-
వైసిపి అధినేత పై ఒకప్పటి వ్యూహకర్త పీకే సంచలన కామెంట్స్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు వ్యూహకర్తలను నియమించుకుంటున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ వచ్చిన తరువాత వ్యూహకర్తల శకం ప్రారంభం అయింది. 2014లో నరేంద్ర మోడీకి వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్. తరువాత నితీష్ కుమార్, మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి, అరవింద్ కేజ్రీవాల్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందికి వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్.
అయితే ఆయన ఫెయిల్యూర్స్ కంటే సక్సెస్ శాతాన్ని సాధించారు. కానీ స్వరాష్ట్రంలో ఆయన నేరుగా రాజకీయ బరిలో దిగితే వ్యూహాలు పనిచేయలేదు. అందుకే తిరిగి రాజకీయ వ్యూహకర్తగా ఆయన అవతారం ఎత్తారు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డికి మరోసారి వ్యూహకర్తగా పని చేయనని తేల్చి చెప్పారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కు సలహాలు సూచనలు అందించారు. అక్కడ ఆయన గెలవడంతో మరోసారి ప్రశాంత్ కిషోర్ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఓ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో..
తాజాగా తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. ఎవరి నుంచి అయినా ప్రయోజనం పొందితే కృతజ్ఞత చూపించుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డిలో అటువంటి కృతజ్ఞతలు లేదన్నారు. ఆయన గెలుపు కోసం కృషిచేసిన దాదాపు అందరూ దూరమైన విషయాన్ని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి కోసం సుదీర్ఘకాలం షర్మిల పాదయాత్ర చేశారని..
ఆ పార్టీ కోసం చాలా విధాలుగా కృషి చేసిన వైనాన్ని గుర్తు చేశారు. తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిలను దూరం పెట్టడాన్ని తప్పుపట్టారు. వారిని వీధిన పడేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి లాంటి కృతజ్ఞతలు లేని వ్యక్తికి మరోసారి రాజకీయ వ్యూహ కర్తగా సేవలు అందించడానికి తాను సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు.
సరిగ్గా ఈ సమయంలోనే..
తమిళనాడు టీవీ కే పార్టీ విజయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కోసం ఆరాటపడుతోంది. అదే సమయంలో ఆ పార్టీకి సేవలందించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందుల్లో పెడుతున్నాయి. పైగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని బయటపెడుతున్నారు. ఇది కాస్త ఆయనతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. ఇప్పటికే ఒకప్పటి సన్నిహితుల నుంచి తీవ్ర రకాల వ్యాఖ్యలు ఎదురవుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఏకంగా ఒకప్పటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు.
జగన్మోహన్ రెడ్డితో పని చేయను గాక.. ఆయన వ్యక్తిత్వం మంచిది కాదంటూ నేరుగా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మాత్రం సంచలనంగా మారింది. అయితే ఇంతలా జగన్మోహన్ రెడ్డి పై ప్రశాంత్ కిషోర్ కోపం పెంచుకోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఆర్థికపరమైన లావాదేవీలతో పాటు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో ప్రశాంత్ కిషోర్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు తెలుస్తోంది. 2019లో జగన్ గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ కు పట్టించుకోకపోవడం వల్లే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియాలి.