క్రైమ్ మిర్రర్ : మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించాలని కుట్ర పన్నిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త అనుమానంతో భార్య మొబైల్‌ను పరిశీలించగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సంభాషణల్లో హత్యకు సంబంధించిన ప్రణాళిక ఉన్నట్లు గుర్తించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల వివరాల ప్రకారం, డోర్నకల్లు మండలంలోని చిలుకోడు గ్రామానికి చెందిన రాజేశ్వరరావుకు 2016లో సూర్యాపేట జిల్లా రాఘవాపురానికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం కుటుంబం ఖమ్మం జిల్లా ఏదులాపురంలో నివాసం ఉంటుండగా, రాజేశ్వరరావు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఇటీవల మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లిన రాజేశ్వరరావు, తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని గమనించాడు. దీంతో అనుమానం పెరగడంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన అన్నను తీసుకురావడానికి వెళ్లిన సమయంలో అనుమానిత వ్యక్తి తనను వెంబడిస్తున్నట్లు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న రాజేశ్వరరావు భార్య మొబైల్‌ను పరిశీలించాడు. అందులోని చాట్‌లలో తనను ఇంట్లో కాకుండా బయట ప్రమాదంలా కనిపించే విధంగా హత్య చేయాలని మహిళ తన ప్రియుడిపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో బాధితుడు ఆగస్టు 1న డోర్నకల్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసు పరిధి ప్రకారం ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : జాకీతో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది: రకుల్ ప్రీత్ సింగ్
