సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తన భవిష్యత్ ప్రయాణంపై ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఇకపై తన పూర్తి దృష్టిని సినిమాలపైనే కేంద్రీకరించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆయన చేసిన భావోద్వేగ పోస్టు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
తన జీవిత ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని బండ్ల గణేశ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే, కష్టాల్లో ఉన్న సమయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తులను మాత్రం ఎప్పటికీ మరిచిపోనని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు ఒకలా, పని పూర్తయ్యాక మరోలా వ్యవహరించడం తన స్వభావం కాదని స్పష్టం చేశారు.
సినిమాల విషయంలో ఇకపై మరింత ఫోకస్‌తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. మంచి కథలను ఎంచుకుని, నాణ్యమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు.
దీంతో బండ్ల గణేశ్ మరోసారి పూర్తిస్థాయిలో సినీ రంగంపై దృష్టి పెట్టబోతున్నారనే చర్చ మొదలైంది. ఆయన ప్రకటనతో అభిమానులు, సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతగా ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆకాంక్షిస్తున్నారు.
also read: నిర్మల్‌లో కలకలం.. ఇంటి ముందు వెన్నుముక, వింత వస్తువులు
