ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు మృతి చెందడం నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. అన్న మరణవార్త విన్న కొద్దిసేపటికే తమ్ముడు కూడా ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
పెద్దకొత్తపల్లి మండలం పెరుమాండ్లపల్లికి చెందిన సల్కూటి సింహారెడ్డి (68) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆయన మృతి చెందారు. సింహారెడ్డి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఇదిలా ఉండగా.. సింహారెడ్డి తమ్ముడు సల్కూటి లింగారెడ్డి (64) హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అన్న మృతి చెందిన విషయం తెలుసుకున్న లింగారెడ్డి తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అన్న మరణవార్త విన్న దాదాపు పది నిమిషాల్లోనే ఆయన కూడా మృతి చెందారు.
ఒకే రోజు అన్నదమ్ములు ఇద్దరూ మృతి చెందడంతో పెరుమాండ్లపల్లిలో విషాద వాతావరణం నెలకొంది. సాయంత్రం ఇద్దరి భౌతికకాయాలను గ్రామానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల సమక్షంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అన్నదమ్ముల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
also read: బాక్సాఫీస్‌పై రవితేజ ‘ఇరుముడి’ జోరు.. RRR తర్వాతి స్థానంలో రికార్డు వసూళ్లు!
