దేశ రాజధాని ఢిల్లీలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తాము పోలీసులమంటూ నమ్మించిన ముగ్గురు యువకులు బాలికను బెదిరించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి కల్కాజీ మందిరానికి వెళ్లింది. అనంతరం సమీపంలోని ఓ పార్కులో ఇద్దరూ కూర్చున్నారు. అదే సమయంలో పోలీసుల దుస్తుల్లో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికి వచ్చారు. తాము పోలీసులమని చెప్పి బాలిక, ఆమె స్నేహితుడిని బెదిరించినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన అనంతరం తీవ్ర ఆందోళనకు గురైన బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించే పనిలో ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
also read: వినాయక చవితి వేడుకల్లో విషాదం.. అన్నదాన కార్యక్రమం రోజు వేడి సాంబారులో పడి మహిళ మృతి
