Homeజాతీయంయమునా ప్రక్షాళనకు బిట్టు తబాహీ శ్రీకారం.. తొలి రోజే 585 కిలోల చెత్త తొలగింపు

యమునా ప్రక్షాళనకు బిట్టు తబాహీ శ్రీకారం.. తొలి రోజే 585 కిలోల చెత్త తొలగింపు

నదులను శుభ్రం చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ ‘బిట్టు తబాహీ’ మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నదిని స్వయంగా శుభ్రం చేసి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 20న యమునా నది శుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు బిట్టు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. మూడు రోజుల పాటు ఈ క్లీనింగ్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. మొదటి రోజే తాను, పలువురు వాలంటీర్లతో కలిసి సుమారు నాలుగున్నర గంటల పాటు శ్రమించి యమునా తీరంలో పేరుకుపోయిన 585 కిలోల వ్యర్థాలను తొలగించినట్లు చెప్పారు.

యమునా నది పరిసరాల్లో పూలు, పూల దండలు, పూజా సామగ్రితో పాటు పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయినట్లు బిట్టు తెలిపారు. శుభ్రత కార్యక్రమాన్ని గమనించిన స్థానికులు కూడా స్వచ్ఛందంగా తమతో కలిసి పనిచేయడంతో తీర ప్రాంతాన్ని మరింత విస్తృతంగా శుభ్రం చేయగలిగామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తన శుభ్రత కార్యక్రమాలకు మద్దతు అందిస్తున్న ఫిలిప్ మోరిస్ సంస్థకు కూడా బిట్టు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో అజ్నార్ నదిని శుభ్రం చేసిన ఆయన కృషికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. నెదర్లాండ్స్‌కు చెందిన ‘ది ఓషన్ క్లీనప్’ సంస్థ వ్యవస్థాపకుడు బోయన్ స్లాట్ నుంచి ఉద్యోగ అవకాశం కూడా అందుకున్నట్లు ఆయన గతంలో వెల్లడించారు.

దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి నదుల పరిరక్షణ, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తన లక్ష్యమని బిట్టు చెబుతున్నారు. యమునా శుభ్రత కార్యక్రమం అనంతరం గురుగ్రామ్‌లోని ఖేడ్కీ దౌలా ప్రాంతానికి వెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. బిట్టు యమునా క్లీనింగ్ డ్రైవ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌గా మారింది. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 3.34 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో పాటు పెద్ద సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. ఒక్క వ్యక్తి సంకల్పిస్తే సమాజంలో మార్పు తీసుకురావచ్చని పలువురు నెటిజన్లు ప్రశంసించారు.

అదే సమయంలో నది శుభ్రం చేసే సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) తప్పనిసరిగా ఉపయోగించాలని కొందరు సూచించారు. నదుల పరిశుభ్రత కోసం బిట్టు చేస్తున్న ప్రయత్నం సోషల్ మీడియాలో పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

also read: పోలీసులమని నమ్మించి మైనర్ బాలికపై దారుణం.. ముగ్గురు యువకులపై పోక్సో కేసు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు