ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోయ లక్ష్మి అనూహ్యంగా మృతి చెందారు. ఎన్నికల్లో గెలిచి రాజకీయంగా సంతోషంలో ఉన్న సమయంలోనే ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.
కర్నూలు జిల్లా ఆలూరు-4 ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బోయ లక్ష్మి తన ప్రత్యర్థిపై 628 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని అందుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఆమె విజయోత్సవాలు జరుపుకున్నారు.
అయితే ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆదివారం రాత్రి బోయ లక్ష్మికి అకస్మాత్తుగా రక్తపోటు (బీపీ) సమస్య తలెత్తింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో సోమవారం ఆమె తుదిశ్వాస విడిచారు.
ఎన్నికల్లో విజయం సాధించిన కొద్ది గంటల్లోనే బోయ లక్ష్మి కన్నుమూయడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. గెలుపు సంబరాలు జరుపుకున్న చోటే ఇప్పుడు విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆమె మృతిపట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
also read: 2004లో ప్రధాని పదవిని ఎందుకు వద్దనుకున్నారు? అసలు కారణాలను బయటపెట్టిన సోనియా గాంధీ!
