విజయవాడ నగరంలో ఓ ప్రేమ వ్యవహారం తీవ్ర విషాదానికి దారితీసింది. పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు.. తాను ప్రేమించిన యువతిపై దాడికి పాల్పడి ఆమె మృతికి కారణమయ్యాడు. అనంతరం సమీపంలోని ఓ భవనంపై నుంచి దూకి తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన శనివారం ఉదయం న్యూ రాజరాజేశ్వరీపేటలో చోటుచేసుకుంది. మృతులను పడవల మహాలక్ష్మి (19), మంకు చిన్నారావు (22)గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చిన్నారావు పెయింటింగ్, ఫ్లవర్ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పని కోసం విజయవాడకు వచ్చిన సమయంలో తన అన్నయ్య ఇంట్లో ఉండేవాడు. ఈ క్రమంలో న్యూ రాజరాజేశ్వరీపేటలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నివాస సముదాయంలో నాయనమ్మతో కలిసి ఉంటున్న మహాలక్ష్మితో అతడికి పరిచయం ఏర్పడింది.
మహాలక్ష్మి స్థానికంగా ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తుండగా.. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. కొంతకాలం తర్వాత ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగినట్లు సమాచారం. ఇకపై మహాలక్ష్మి జోలికి వెళ్లనని చిన్నారావు అప్పట్లో అంగీకరించినట్లు తెలుస్తోంది.
అయితే శనివారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో చిన్నారావు మహాలక్ష్మి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మాటామాటా పెరగడంతో చిన్నారావు ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
మహాలక్ష్మిపై దాడి జరిగిన కొద్దిసేపటికే చిన్నారావు సమీపంలోని ఓ భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న అజిత్‌సింగ్ నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ వ్యవహారంపై గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఘటనపై హత్య, ఆత్మహత్య కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమ వ్యవహారం, కుటుంబాల అభ్యంతరాలు, గతంలో జరిగిన పంచాయితీ తదితర అంశాలపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
