అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ (31) మిస్సోరిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఉద్యోగం నిమిత్తం అమెరికాలోని మిస్సోరిలో నివసిస్తున్న సుప్రియ.. తెల్లవారుజామున కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినడంతో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న మరో భారతీయ యువతికి కూడా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆమెకు స్థానికంగా చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
సుప్రియ భర్త కొడుమూరి రంజిత్‌తో పాటు అత్తమామలు కొడుమూరి వెంకటేశ్వర్లు, రాధిక మహబూబాబాద్ పట్టణంలోని వీరభద్ర అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. సుప్రియ మృతి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతదేహాన్ని భారత్‌కు తరలించే ప్రక్రియపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
also read: ప్రేమ వ్యవహారం విషాదాంతం.. యువతిపై దాడి చేసి యువకుడి ఆత్మహత్య
