Homeసినిమాపుష్ప సినిమాని దాటేస్తున్న అల్లు అర్జున్ రాకా.. ఓటీటీ డీల్ పై హాట్ టాపిక్‌!!

పుష్ప సినిమాని దాటేస్తున్న అల్లు అర్జున్ రాకా.. ఓటీటీ డీల్ పై హాట్ టాపిక్‌!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పుష్ప-2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు డిజిటల్ రైట్స్ పరంగా కూడా ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపింది. ఇప్పుడు అల్లు అర్జున్ తదుపరి చిత్రం రాకా అదే స్థాయిలో కాకుండా అంతకంటే పెద్ద రికార్డులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రకటించిన నాటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. భారీ విజువల్స్, అత్యాధునిక సాంకేతికతతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌లో ఆయన గెటప్, డిజైన్, మేకోవర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా బన్నీని అట్లీ ప్రెజెంట్ చేయబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, రమ్యకృష్ణ వంటి ప్రముఖ నటీనటులు కూడా కీలక పాత్రల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం రాకా ఓటీటీ హక్కుల వ్యవహారమే. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నిర్మాతలు రూ.300 కోట్లకు పైగా ఆశిస్తున్నారట.

ఒకవేళ ఆ స్థాయిలో డీల్ కుదిరితే భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ఓటీటీ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ పరిస్థితులు గతంతో పోలిస్తే మారిపోయాయి. కేవలం స్టార్ హీరో ఇమేజ్ మాత్రమే కాకుండా కథ, కంటెంట్, థియేట్రికల్ ఫలితం, ప్రపంచవ్యాప్త మార్కెట్ వంటి అంశాలను కూడా సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. దీంతో రాకా నిజంగానే పుష్ప-2 డిజిటల్ రికార్డును అధిగమిస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం ఈ మూవీ ఓటీటీ డీల్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు