కర్నూలు, క్రైమ్‌మిర్రర్: ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశీయ ఖనిజ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. భారతదేశంలోనే తొలిసారిగా భారీ తరహా ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ను ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు.జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు రూ. 400 కోట్లకు పైగా వ్యయంతో ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో విస్తరించి ఉన్న సుమారు 598 హెక్టార్ల లీజు భూమిలో ఈ మైనింగ్ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో కేవలం 13 నెలల రికార్డు కాలంలోనే ఇక్కడి ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని, పైలట్ రన్ ప్రక్రియను పూర్తి చేశారు.
Also Read:‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’పై సమీక్షకు జిల్లాల వారీగా ప్రత్యేకాధికారులు!!
ఈ ప్లాంట్ ద్వారా ప్రతి ఏటా సుమారు 4 లక్షల టన్నుల బంగారు ఖనిజాన్ని ప్రాసెస్ చేయనున్నారునిక్షేపాల అంచనాల పరంగా జొన్నగిరి గని దేశీయ పసిడి రంగంలో గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది. ప్రాథమిక అన్వేషణలో జొన్నగిరి ఓపెన్ పిట్ పరిధిలోనే దాదాపు 13,100 కిలోల నిఖార్సైన బంగారు నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వేలు స్పష్టం చేశాయి. ఇక మొత్తం లీజు మైనింగ్ ప్రాంతంలో అంచెలంచెలుగా జరిపిన లోతైన పరిశోధనల ప్రకారం.. ఇక్కడ ఏకంగా 42.5 టన్నుల నుండి 50,000 కిలోల వరకు పసిడి నిల్వలు పెరిగే అవకాశం ఉన్నట్లు మైనింగ్ నిపుణులు నిర్ధారించారు. పూర్తిస్థాయి కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభమయ్యాక, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి సగటున 1,000 కిలోల శుద్ధి చేసిన విదేశీ ప్రమాణాల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read:సాయి కృష్ణ’ కేసులో వైసీపీకి షాక్…!
ఈ భారీ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో లభించిన ఉత్సాహంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖనిజ సంపద వెలికితీతను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో గుర్తించిన మరో నాలుగు కొత్త గోల్డ్ బ్లాక్‌లను త్వరలోనే బహిరంగ వేలం వేయడానికి మైన్స్ అండ్ జియాలజీ శాఖ కసరత్తు పూర్తి చేసింది. భారతదేశం ప్రతి ఏటా దాదాపు 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్న తరుణంలో.. కేజీఎఫ్ మూతపడిన తర్వాత ఏర్పడిన లోటును భర్తీ చేస్తూ ఏపీలో ప్రారంభమవుతున్న ఈ జొన్నగిరి ప్రాజెక్ట్ దేశ ఆర్థికాభివృద్ధికి, స్థానిక నిరుద్యోగుల ఉపాధికి పెద్ద బూస్ట్‌గా నిలవనుంది.
Also Read:రేపు ఆదివారం అయినా స్కూళ్లకు వెళ్లాల్సిందే.. రాష్ట్రంలో యోగా దినోత్సవంపై విద్యాశాఖ ఆదేశాలు