Homeజాతీయంహైదరాబాద్ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు సఫలం!!

హైదరాబాద్ మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు సఫలం!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రులతో జరిపిన వరుస సమావేశాలు విజయవంతమయ్యాయి. మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, అలాగే ఫేజ్-2 విస్తరణ పనుల్లో ఉన్న అన్ని ప్రధాన ఆటంకాలు ఈ చర్చలతో తొలగిపోయాయి. ఈరోజు (మంగళవారం) ఉదయం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు ఉన్నతస్థాయి సంయుక్త సమావేశం జరిగింది.

ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్ (రైల్వే శాఖ), జి. కిషన్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మెట్రో విస్తరణ, నిధుల సమీకరణ, కేంద్ర-రాష్ట్ర ఉమ్మడి భాగస్వామ్యంపై ఈ సమావేశంలో అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. మెట్రో ప్రాజెక్టును ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిష్ఠాత్మక ఆర్థిక సలహా సంస్థను ‘SBICAPS’ (SBI Capital Markets) కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. ఈ సంస్థ ప్రధాన అంశాలపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన అప్పులు, ఈక్విటీ విలువ (వాల్యూయేషన్) రుణ సేకరణపై SBICAPS రోడ్ మ్యాప్ తయారు చేస్తుంది. ఫేజ్-2 కింద ప్రతిపాదించిన కారిడార్ల నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది? నిధుల కోసం ఏయే అంతర్జాతీయ రుణ సంస్థలను ఎంచుకోవాలి? అనే అంశాలపై నివేదిక అందిస్తుంది.

ఈ కన్సల్టెంట్ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తదుపరి అడుగులు వేస్తాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో కేంద్రప్రభుత్వ ప్రతినిధితో పాటు తెలంగాణ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సమన్వయ సభ్యులుగా వ్యవహరిస్తారు. కేంద్ర నిబంధనల ప్రకారం డీపీఆర్ లలో మార్పులు చేస్తూ, పనుల అనుమతుల ప్రక్రియను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఈ పరిణామంతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేంద్ర ఆమోదం లభించడం సులభతరం కానుంది. ఇది హైదరాబాద్ నగర ట్రాఫిక్ కష్టాలను తీర్చడమే కాక, భవిష్యత్తు ప్రజా రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలవనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు