HomeజాతీయంExtreme Heatwave: 45 డిగ్రీల వేడి.. మే, జూన్‌లో పరిస్థితి ఇంకా కష్టమే .. వాతావరణ...

Extreme Heatwave: 45 డిగ్రీల వేడి.. మే, జూన్‌లో పరిస్థితి ఇంకా కష్టమే .. వాతావరణ హెచ్చరిక!

Heatwave Alert in India: దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మే, జూన్ నెలల్లో వేడి మరింత ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈసారి వేసవి సాధారణం కంటే ఎక్కువకాలం కొనసాగడంతో పాటు, అత్యంత వేడిగా ఉండే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు..

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి వచ్చే రెండు వారాల్లో మరింత తీవ్రమవుతుందని అంచనా. సాధారణంగా దక్షిణ భారతంలో వేసవి సమయంలో తూర్పు గాలులు వీచి కొంత చల్లదనాన్ని కలిగిస్తాయి. కానీ ఈసారి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఆ గాలులు బలహీనపడ్డాయి. అదే సమయంలో ఉత్తర భారతం నుంచి పొడి, వేడి గాలులు దక్షిణం వైపు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

తీవ్ర ఎల్‌నినో కారణంగానే..

ఇంకా ఒక ముఖ్యమైన కారణంగా ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో లానినా బలహీనపడుతూ తటస్థ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది సాధారణంగా ఉష్ణోగ్రతలు పెరగడానికి దారి తీస్తుంది. ఈ మార్పులు దేశంలో వేడి తీవ్రతను పెంచుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో  అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల వేడి మరింత ఎక్కువగా అనిపిస్తోంది. ఈ తీవ్ర ఎండల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై మాత్రమే కాకుండా, వ్యవసాయంపై కూడా పడుతోంది. పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు