Homeతెలంగాణతెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరగాలి: కవిత

తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరగాలి: కవిత

క్రైం మిర్రర్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు న్యాయం చేసే ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి సూచించారు. ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు అంశాలపై తాను రూపొందించిన సమగ్ర నివేదికను కమిటీకి అందజేశారు.మంగళవారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని అమరజ్యోతి కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులకు, హైదరాబాద్ విమోచన ఉద్యమంలో పాల్గొన్న వారికి అమలవుతున్న నిబంధనలను అధ్యయనం చేసి, అదే తరహాలో తెలంగాణ ఉద్యమకారులకు కూడా తగిన ప్రయోజనాలు కల్పించాలని సూచించారు.

కమిటీ పనితీరుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించేలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం తాను పార్టీలోనూ నిరంతరం పోరాటం చేశానని, తన సూచనల ద్వారా వారికి కొంతైనా మేలు జరిగితే అదే తనకు సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని కవిత అన్నారు. ముఖ్యంగా 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కూడా గుర్తింపు ప్రక్రియలో భాగం చేయాలని సూచించారు. ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన వారు, ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జిషీట్లు నమోదైన వారిని ఆలస్యం చేయకుండా గుర్తించాలని కోరారు.

ఉద్యమం కారణంగా ఆస్తి నష్టం, శారీరక వైకల్యం, పోలీసుల వేధింపులు ఎదుర్కొన్న వారిని ప్రత్యేకంగా గుర్తించి తగిన సహాయం అందించాలని తెలిపారు. పలుమార్లు లాఠీచార్జీలో గాయపడిన వారు, ఉద్యమం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి కూడా ప్రభుత్వం తగిన ప్రయోజనాలు కల్పించాలని సూచించారు.ఉద్యమంలో పాల్గొన్న కారణంగా డీలర్‌షిప్‌లు, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారి విషయంలో కూడా మానవతా దృక్పథంతో నిర్ణయాలు తీసుకోవాలని కమిటీని కోరారు. ఉద్యమకారులు మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులకు—భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులకు—ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇతర రాష్ట్రాల్లో ఉద్యమకారులకు అమలవుతున్న సంక్షేమ పథకాలను కూడా అధ్యయనం చేయాలని కవిత సూచించారు. జార్ఖండ్‌లో ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పలు రాష్ట్రాల్లో పెన్షన్ వంటి సదుపాయాలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. అలాంటి విధానాలను పరిశీలించి తెలంగాణలో కూడా అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలు, చట్టపరమైన అంశాల పేరుతో కాలయాపన చేయకుండా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ఉద్యమకారులకు న్యాయం చేయాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు.
also read : మీర్‌పేటలో రౌడీ షీటర్ దారుణ హత్య..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు