క్రైం మిర్రర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు. నర్సాపూర్ సీఐ రంగకృష్ణ, ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 17న నర్సాపూర్ బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. తొలుత గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించగా, మృతురాలు కొల్చారం మండలం వరిగుంటం గ్రామానికి చెందిన మెట్ట శేఖమ్మ (40)గా గుర్తించారు.
పోస్టుమార్టం నివేదికలో శరీరంపై స్పష్టమైన గాయాల ఆనవాళ్లు కనిపించకపోయినా, మహిళ చేతులు కట్టివేసి ఉండటంతో పోలీసులు ఆ కోణంలో విచారణను ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా సేకరించిన సమాచారం మేరకు, ఘటన జరిగిన రాత్రి మృతురాలు నర్సాపూర్ బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉండగా, శివంపేట మండలం చెన్నాపూర్ గ్రామ పరిధిలోని సామ్య తండాకు చెందిన కాట్రోత్ సురేష్ ఆమెతో పరిచయం పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ కలిసి మద్యం సేవించినట్లు విచారణలో తేలిందన్నారు.
పోలీసుల కథనం ప్రకారం, ఆ తర్వాత మహిళపై లైంగిక దాడికి యత్నించిన సమయంలో ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు తాడుతో ఆమె చేతులు కట్టివేసి, నోటిని బిగించి మూసివేయడంతో ఊపిరాడక ఆమె మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. అనంతరం మృతురాలి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మృతురాలి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ కేసును కేవలం నాలుగు రోజుల్లో ఛేదించిన నర్సాపూర్ సీఐ రంగకృష్ణ, ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందాన్ని డీఎస్పీ అభినందించారు. దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.
also read : ఆత్మహత్యకు ముందు లేఖ.. బీటెక్ విద్యార్థిని మృతి కలకలం