రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హృదయాలను కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టి ఒకటి లేదా రెండు రోజులే అయి ఉండొచ్చని భావిస్తున్న నవజాత ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపక్కన సంచిలో వదిలివెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి శిశువును ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
పోలీసుల వివరాల ప్రకారం.. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) సర్వీస్ రోడ్డులోని ఎయిర్‌పోర్ట్ కాలనీ బ్రిడ్జి సమీపంలో మంగళవారం ఉదయం ఒక తెల్లటి సంచి అనుమానాస్పదంగా కనిపించింది. దానిని గమనించిన స్థానికులు డయల్-100కు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఆర్జీఐఏ పోలీసులు సంచిని పరిశీలించగా అందులో నవజాత ఆడ శిశువు ఉన్నట్లు గుర్తించారు.శిశువును వెంటనే శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య సంరక్షణ కోసం హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని శిశు విహార్‌కు తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆర్జీఐఏ పోలీసులు శిశువును అక్కడ వదిలివెళ్లిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ, ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.ఈ నవజాత శిశువు గురించి ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే వెంటనే ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
also read : ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెన్షన్‌పై మాజీ సీబీఐ డైరెక్టర్ స్పందన