Homeక్రైమ్నిజాంపేటలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

నిజాంపేటలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

క్రైం మిర్రర్ : నిజాంపేట–161 జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉండటం విషాదకరంగా మారింది. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున నిజాంపేట మండలం బాచేపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి–161పై ఈ ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన ఓ కుటుంబం విదేశాల నుంచి వస్తున్న బంధువును తీసుకువచ్చేందుకు హైదరాబాద్ విమానాశ్రయానికి స్కార్పియో వాహనంలో బయలుదేరింది.

ఈ క్రమంలో బాచేపల్లి సమీపంలో వాహనం వేగంగా వెళ్తుండగా ముందుగా వెళ్తున్న బైక్‌ను తప్పించేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో స్కార్పియో రోడ్డుపై పలుమార్లు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో షామీన్ బేగం (50), ఆమె కుమారుడు నదీమ్ (30), మనవరాలు అనాబియా (4) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమారుడు నవీద్ (25) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులకు మొదట నారాయణఖేడ్ ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read : రాజస్థాన్‌లో చిరుత బీభత్సం.. ముగ్గురిపై దాడి.. ఐదు గంటల పాటు ఉత్కంఠ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు