-
బోరు గుంతలో పడిన మనవడిని కాపాడుతూ తాత మృతి
-
ఊట్లపల్లి శివారులో విషాద ఘటన.. బాలుడు సురక్షితం
క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి గ్రామ శివారులో శనివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బోరు గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయిన మనవడిని కాపాడేందుకు ప్రాణాలర్పించిన తాత కథ గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది.స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఊట్లపల్లి శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న బోరు గుంతలో పడిపోయాడు.

ఇది గమనించిన బాలుడి తాత వెంకన్న (53) తీవ్ర ఆందోళనకు గురై, మనవడిని రక్షించాలనే ఆతృతతో వెంటనే బోరు గుంతలోకి దిగాడు.అయితే, బాలుడిని పైకి తీసే ప్రయత్నంలో వెంకన్న కూడా గుంతలో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.

అత్యంత శ్రమతో తాత, మనవడిని బోరు గుంతలో నుంచి బయటకు తీశారు. బాలుడు సురక్షితంగా బయటపడగా.. గుంతలో ఆక్సిజన్ అందక వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన మృతిచెందారు.మనవడు ప్రాణాలతో బయటపడినా.. అతడిని కాపాడే క్రమంలో కుటుంబ పెద్దను కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకన్న మృతితో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచివేశాయి.