ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక శుభవార్త అందుతోంది. ఇప్పటికే రాష్ట్రం మీదుగా అనేక జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇప్పుడు చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే కూడా త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. దాదాపు తుది దశకు చేరుకున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చెందిన పలమనేరు ప్రాంత ప్రజలకు ఈ హైవే భారీ ఊరటనివ్వనుంది.
మొత్తం 258 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమవుతున్న ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను సుమారు రూ.17,930 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలో దాదాపు 65 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణం జరుగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం మీదుగా ఈ మార్గం కొనసాగనుండగా, ప్రస్తుతం ఎక్కువ భాగం పనులు పూర్తయ్యాయి. మొగిలి ఘాట్ ప్రాంతంలో సుమారు 7 కిలోమీటర్లు, గడ్డూరు సమీపంలో మరో 3 కిలోమీటర్ల మేర పనులు మాత్రమే మిగిలి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే ఐదు నెలల్లో ఈ నిర్మాణం పూర్తయ్యే అవకాశముందని సమాచారం.
ఈ హైవే ప్రత్యేకతల్లో అటవీ ప్రాంతాల్లో జంతువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలు ప్రధానంగా నిలుస్తున్నాయి. పలమనేరు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండటంతో వాటికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రత్యేక అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. దాదాపు 12 అండర్‌పాస్‌ల నిర్మాణం జరుగుతుండగా, వీటి పనులు కూడా త్వరలో పూర్తికానున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ నిర్మిస్తున్న ఈ హైవే దేశంలోనే ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తింపు పొందుతోంది.
ప్రస్తుతం పలమనేరు నుంచి బెంగళూరుకు చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతోంది. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే కేవలం గంటన్నరలోనే బెంగళూరుకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే చెన్నై ప్రయాణ సమయం కూడా భారీగా తగ్గనుంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి చెన్నై చేరుకోవడానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుండగా, కొత్త హైవే ద్వారా అది గంటన్నర నుంచి రెండు గంటల మధ్యకే పరిమితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రయాణ సమయం దాదాపు 75 శాతం వరకు తగ్గుతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం నాలుగు వరుసల మార్గంగా ఈ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని ఎనిమిది వరుసలుగా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ హైవే పూర్తయితే పారిశ్రామిక, వ్యాపార, పర్యాటక రంగాలకు భారీ ఊతం లభించనుంది. ముఖ్యంగా ఏపీ నుంచి బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లే ప్రజలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
ALSO READ: అల్లుడిపై ప్రేమతో అరుదైన కానుక.. మామగారి గిఫ్ట్ చూసి నెటిజన్లు ఫిదా..!