Homeజాతీయంఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళనపై రాహుల్ గాంధీ స్పందన.. సీఎం సోరెన్‌కు కీలక సూచనలు

ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళనపై రాహుల్ గాంధీ స్పందన.. సీఎం సోరెన్‌కు కీలక సూచనలు

ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సోమవారం లేఖ రాసిన ఆయన.. నిరసన చేస్తున్న విద్యార్థుల ప్రతినిధులతో సీఎం స్వయంగా సమావేశమై వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థుల నిరసన 24 రోజులుగా కొనసాగుతోంది. ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కొందరు నిరసనకారులు నిరవధిక నిరాహార దీక్షకు కూడా దిగారు.

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలని సూచించారు.

విద్యార్థులతో ప్రభుత్వం ఇప్పటికే చర్చలు ప్రారంభించడం మంచి పరిణామమని రాహుల్ పేర్కొన్నారు. కొన్ని అంశాలపై అంగీకారం కుదిరినట్లు సమాచారం ఉందని, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలపై సీఎం స్వయంగా విద్యార్థులతో చర్చిస్తే ప్రభుత్వంపై వారి విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు.

ఇదిలా ఉంటే.. విద్యార్థుల ప్రతినిధులు, ప్రభుత్వానికి మధ్య సోమవారం నాలుగో విడత చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశం అనంతరం ఆందోళన తదుపరి కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆగస్టు 20న సీఎం హేమంత్ సోరెన్ నివాసాన్ని ముట్టడిస్తామని విద్యార్థులు ఇప్పటికే ప్రకటించారు.

also read: ఆటో డ్రైవర్ ఇంట్లో రూ.3 కోట్ల నగదు.. తుపాకీ కోసం వెళ్లిన పోలీసులకు షాక్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు