-గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దేవినేని ఉమా, వంగవీటి రాధాకృష్ణ
-చంద్రబాబు, లోకేష్ గ్రీన్ సిగ్నల్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీలో ఎమ్మెల్సీ పదవులను ఖరారు చేసారా? చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారా? లోకేష్ సైతం ఆమోదముద్ర వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గవర్నర్ కోట కింద నియమితులైన ఇద్దరు ఎమ్మెల్సీలు ఈనెల 28న పదవీ విరమణ చేశారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అయితే ఆ రెండు పదవులు కూటమికే దక్కనున్నాయి. దీంతో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఈ రెండు స్థానాలు టిడిపికే అన్నట్టు ఒప్పందం కుదరడంతో ఆ పార్టీలో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. సీనియర్లతో పాటు జూనియర్లు సైతం ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీలుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పేర్లను ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
సీనియర్ నేత..
దేవినేని ఉమామహేశ్వరరావు సీనియర్ మోస్ట్ లీడర్. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. తన సోదరుడు అకాల మరణంతో నందిగామ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు దేవినేని ఉమామహేశ్వరరావు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు, 2019లో మాత్రం ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాలేదు. రెండుసార్లు నందిగామ నియోజకవర్గం నుంచి.. రెండుసార్లు పెనమలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం తన సీటు త్యాగం చేశారు. కూటమి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేశారు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులను సైతం ప్రకటించారు. కానీ ఇంతవరకు దేవినేని ఉమామహేశ్వరరావుకు చాన్స్ దక్కలేదు.. ఇప్పుడు మాత్రం ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
వంగవీటి వారసుడు..
అటు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణకుసైతం ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. సరైన పదవి కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 2004లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడంతో ఆ పార్టీలో చేరి 2014లో పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2019లో మాత్రం తాను అనుకున్న సీటు ఇవ్వకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విభేదించి టిడిపిలోకి వచ్చారు. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ ఓడిపోయింది టిడిపి. అయినా సరే అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఐదేళ్లపాటు అదే పార్టీలో కొనసాగి 2024 ఎన్నికల్లో సైతం కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో తప్పకుండా ఆయనకు పదవి దక్కుతుందని అంతా భావించారు. ఎట్టకేలకు గవర్నర్ కోట కింద భర్తీ చేస్తున్న ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని బయట ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
