తమిళ సినీ పరిశ్రమలో అభిమానులు ఎంతో ఇష్టపడే జంట సూర్య, జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. ఎంతో ఆత్మీయంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ప్రత్యేకమైన సందర్భానికి సంబంధించిన వీడియోను జ్యోతిక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. 20 ఏళ్ల తమ వైవాహిక ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. ఇది తమ ‘లవ్ అండ్ వార్’కు సీక్వెల్ అంటూ ఆసక్తికరంగా పేర్కొన్నారు.
తమ బంధం ఎప్పుడూ పరిపూర్ణంగా సాగలేదని జ్యోతిక చెప్పుకొచ్చారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఎన్నో సందర్భాల్లో సర్దుబాట్లు చేసుకోవడం, త్యాగాలు చేయడం, నిస్వార్థమైన ప్రేమతో ముందుకు సాగడమే తమ దాంపత్య ప్రయాణమని ఆమె తెలిపారు.
ఈ వేడుకలో సూర్య–జ్యోతిక పిల్లలు దియా, దేవ్ కూడా సందడి చేశారు. ముఖ్యంగా కుమారుడు దేవ్.. తన తల్లి జ్యోతిక చేయి పట్టుకుని ఆమెను వేదిక వద్దకు తీసుకెళ్లిన దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వేడుక సందర్భంగా జ్యోతిక తెల్లటి బ్రైడల్ గౌన్‌లో కనిపించగా.. సూర్య వైట్ టక్సేడోలో మెరిశారు. సూర్య సోదరుడు, ప్రముఖ నటుడు కార్తీ కూడా ఈ కార్యక్రమానికి హాజరై కుటుంబంతో కలిసి సందడి చేశారు.
సూర్య, జ్యోతిక 2006 సెప్టెంబర్ 11న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అంతకుముందే 1999లో వచ్చిన ‘పూవెల్లం కెట్టుప్పార్’ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. రెండు దశాబ్దాలుగా కలిసి ప్రయాణిస్తున్న ఈ జంట.. 20వ వివాహ వార్షికోత్సవాన్ని ఇలా మరోసారి పెళ్లి ప్రమాణాలతో జరుపుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
also read: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి
