క్రైమ్ మిర్రర్ : ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన ఝీరం వ్యాలీ మావోయిస్టుల దాడి కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేలిన 10 మందికి మరణశిక్ష విధించింది. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. జగదల్పూర్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ మేరకు తీర్పు ప్రకటించింది. 2013 మే 25న బస్తర్ జిల్లా దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝీరం ఘాటీ వద్ద ఈ దాడి జరిగింది. పరివర్తన్ ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తున్న కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌ను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అప్పటి ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నంద్‌కుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ పటేల్, అప్పటి ప్రతిపక్ష నేత మహేంద్ర కర్మ, మాజీ కేంద్ర మంత్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముద్లియార్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది, సాధారణ పౌరులు కూడా ఈ దాడిలో మృతిచెందారు.
101 మంది సాక్షుల వాంగ్మూలాలు
కేసు విచారణలో భాగంగా మొత్తం 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పెద్ద సంఖ్యలో పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. ఈ నెల ప్రారంభంలో జగదల్పూర్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిందితుల్లో 10 మందిని దోషులుగా నిర్ధారించింది. అనంతరం తాజాగా శిక్షలపై కోర్టు నిర్ణయం ప్రకటించింది. దోషులపై నమోదైన మొత్తం 24 అభియోగాల్లో ఏడు అభియోగాల కింద ఒక్కొక్కరికి మరణశిక్ష విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ.800 చొప్పున జరిమానా విధించినట్లు కోర్టు వెల్లడించింది.
హైకోర్టు అనుమతి తర్వాతే అమలు
మరణశిక్షను వెంటనే అమలు చేయరు. ఈ తీర్పుపై దోషులు 30 రోజుల్లోపు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాతే మరణశిక్ష అమలుకు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. అప్పటి వరకు దోషులు కేంద్ర కారాగారంలోనే ఉండనున్నారు. తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేసుకునే హక్కు దోషులకు ఉందని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.
also read: చాక్లెట్ తిన్న కొద్దిసేపటికే యువతి మృతి
