Homeఆంధ్ర ప్రదేశ్ఇదేం జబ్బురా బాబోయ్.. మహిళలా మారిపోతున్న పురుషుడు!!

ఇదేం జబ్బురా బాబోయ్.. మహిళలా మారిపోతున్న పురుషుడు!!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : గుంటూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన 36 ఏళ్ల విజేయుడు గత కొంతకాలంగా చేతులు, కాళ్ల కండరాలు బలహీనపడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. రోజువారీ పనులు కూడా చేయలేని పరిస్థితి రావడంతో గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్) న్యూరాలజీ విభాగాన్ని ఆశ్రయించాడు. వైద్యులు పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడు అరుదైన ‘కెన్నెడీ డిసీజ్’తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ గాజుల రామకృష్ణ మాట్లాడుతూ.. వైద్య పరిభాషలో ఈ వ్యాధిని స్పైనల్ అండ్ బల్బర్ మస్క్యులర్ అట్రోఫీ అని పిలుస్తారని తెలిపారు. 1962లో అమెరికన్ వైద్యుడు విలియం కెన్నెడీ, ఆయన సహచరులు ఈ వ్యాధిని గుర్తించడంతో దీనికి ‘కెన్నెడీ డిసీజ్’ అనే పేరు వచ్చిందన్నారు. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడటంతో పాటు హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింటుందని వైద్యులు వివరించారు.

ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టెరాన్ ప్రభావం తగ్గిపోవడంతో పురుష లక్షణాలు క్రమంగా తగ్గి, మహిళల్లో కనిపించే కొన్ని లక్షణాలు బయటపడతాయని తెలిపారు. వీర్యకణాల ఉత్పత్తి తగ్గడం, లైంగిక ఆసక్తి తగ్గిపోవడం, అలాగే వక్షోజాల పరిమాణం పెరగడం వంటి మార్పులు కనిపించే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాధి జన్యుపరమైన లోపాల వల్ల వస్తుందని, బాధితుడి కుటుంబ సభ్యుల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. కెన్నెడీ డిసీజ్‌కు పూర్తిస్థాయి నివారణ ప్రస్తుతం లేకపోయినా, సరైన చికిత్స, మందులు, ఫిజియోథెరపీ, క్రమం తప్పని వైద్య పర్యవేక్షణ ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని డాక్టర్ రామకృష్ణ తెలిపారు. బాధితులు మనోధైర్యం కోల్పోకుండా చికిత్స కొనసాగిస్తే జీవన నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలాంటి అరుదైన జన్యు వ్యాధులకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో అవసరమైన చికిత్స అందుబాటులో ఉందని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు