టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తన స్నేహితురాలు మహికా శర్మతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన, స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తన మొక్కులో భాగంగా హార్దిక్ పాండ్యా శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన ఆయన భక్తులకు కనిపించారు. తెల్లటి కుర్తా-పైజామాలో, గుండుతో కనిపించిన పాండ్యాను చూసి భక్తులు, అభిమానులు ఆసక్తిగా గమనించారు.
తిరుమలలో తలనీలాలు సమర్పించడం భక్తులు ఎంతో పవిత్రమైన మొక్కుగా భావిస్తారు. తమ కోరికలు నెరవేరిన సందర్భంగా లేదా ప్రత్యేక ప్రార్థనల్లో భాగంగా భక్తులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.
దర్శనం అనంతరం హార్దిక్ పాండ్యా, మహికా శర్మలకు ఆలయ అధికారులు సత్కారం చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.
తిరుమల పర్యటనకు సంబంధించిన హార్దిక్ పాండ్యా ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు ఆయన కొత్త లుక్‌పై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
also read: దారుణం.. భార్య కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి హత్య
