కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబానికి సంబంధించిన నివాసాల్లో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. బుధవారం తిరువనంతపురంలోని బేకరీ జంక్షన్ లో ఉన్న విజయన్ అద్దె నివాసంతో పాటు కన్నూరు జిల్లాలోని కుటుంబ నివాసాలపైనా ఈడీ అధికారులు ఒకేసారి తనిఖీలు చేపట్టారు. మొత్తం పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
విజయన్ నివాసం ముందు ఉద్రిక్తత
ఈ విషయం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో విజయన్ మద్దతుదారులు, సీపీఎం కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సోదాలు జరుగుతున్న ప్రాంతాల వద్ద భద్రతా సిబ్బంది భారీగా మోహరించారు. ఆందోళనకారులను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది కార్యకర్తలు ఈడీ చర్యలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో కొందరు ఆగ్రహంతో భద్రతా సిబ్బందిపై తోపులాటకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం సీపీఎం సీనియర్ నాయకులు రంగంలోకి దిగి కార్యకర్తలను శాంతింపజేశారు. వారితో మాట్లాడి ఆందోళనను విరమింపజేయడానికి ప్రయత్నించారు.
ఈడీ అధికారుల వాహనాలపై రాళ్లదాడి
సోదాలు ముగించుకుని ఈడీ అధికారులు అక్కడి నుంచి వెళ్లే సమయంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారుల వాహనాలపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వినట్లు సమాచారం. కొన్ని కార్ల అద్దాలు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వాహనాలపై దాడి చేసిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈడీ సోదాల కారణాలు ఏమిటి? ఏ కేసుకు సంబంధించి తనిఖీలు నిర్వహించారు? అనే విషయంపై అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. కేరళ రాజకీయాల్లో ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా ఇది దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.