కదిరిలో ఓ రౌడీషీటర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు అరెస్ట్ వారెంట్‌తో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా.. కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో రౌడీషీటర్‌తో పాటు అతని భార్య, తల్లి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
కదిరికి చెందిన రౌడీషీటర్ శివపై అనంతపురంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శివను అరెస్ట్ చేసేందుకు కదిరి పోలీసులు అతని నివాసానికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన కుటుంబ సభ్యులు అరెస్ట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దాదాపు రెండు గంటల పాటు పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. చివరకు అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శివ, అతని భార్య, తల్లి క్రిమిసంహారక మందు సేవించినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురూ అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పోలీసులు వెంటనే కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఇదే సమయంలో శివ తండ్రి చంద్రశేఖర్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ
ఈ ఘటనపై కదిరి సీఐ వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం వంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
also read: తాండూరులో రైలులో గంజాయి అక్రమ రవాణా.. ముగ్గురు అరెస్ట్, 52.88 కిలోలు స్వాధీనం
