Homeజాతీయంసీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్!!

సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ పెట్టిన తక్కువ రోజుల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జోసఫ్ విజయ్‌పై ప్రతిపక్షాలు ఆది నుంచే విమర్శలు కురిపించాయి. అయితే, తాజాగా డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్ సీఎం విజయ్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యమంత్రిపై శృతిమించి వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడు పోలీసులు రాధాకృష్ణన్‌ను అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ కోరినప్పటికీ మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా ఆత్తూర్‌లో బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సభలో రాధాకృష్ణన్ ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి అభ్యంతకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డీఎంకే ఎమ్మెల్యే ఎస్.ఆస్టిన్ ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రశ్నించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి గారూ, నోరు విప్పి మాట్లాడరా? అని ఆస్టిన్ ప్రశ్నించడంతో సభ మొత్తం ఒక్కసారిగా నవ్వింది. అయితే, ఆ సమయంలో సీఎం విజయ్ ముఖంలో అసహనం కనిపించింది. ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేస్తూ కరుణానిధి జయంతి వేడుకల్లో ఆర్.రాధాకృష్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఇంట్లో ఓ హీరోయిన్‌తో ప్రశాంతంగా ఉండేవాడిని.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను అని ఆయన మనస్సులో అనుకున్నట్లు కనిపించింది.

నేను వ్యాపారిని, దుకాణంలోకి వచ్చిన వ్యక్తి సరుకు కొనడానికి వచ్చాడా? లేక అప్పుడ అడగడానికి వచ్చాడా? అనేది చూసి చెప్పగలను. అలాగే అసెంబ్లీలో విజయ్ హావభావాలు చూస్తే అలానే అనవసరంగా ఇక్కడ ఇరుక్కుపోయినట్లు అనిపించింది అన్నట్టే ఉంది” అని రాధాకృష్ణన్ అన్నారు. దాంతో తమిళనాడు పోలీసులు ఆర్.రాధాకృష్ణన్‌పై కేసు నమోదు చేశారు. ఒక శాసన సభ్యుడు ఇలా వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదంటూ మద్రాసు హైకోర్టు ఘాటుగా స్పందించింది. 1967 నుంచి తమిళనాడులో సినీరంగం నుంచి వచ్చిన అనేక మంది నాయకులను ప్రజలు ఎన్నుకున్నారని.. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకు? అంటూ కోర్టు ప్రశ్నించింది. ప్రజాప్రతినిధి ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దాంతో పోలీసులు రాధాకృష్ణన్‌ను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు