నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరూ ప్రజా సమస్యలను పక్కనపెట్టి ‘లాగుల’ గురించి మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వారిద్దరికీ ప్రజాక్షేమం కంటే వాటిపైనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయి అన్నదాతలు కన్నీరు పెడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పసుపు రైతులకు క్వింటాల్‌కు రూ.30 వేలు: ఎంపీ హామీ
రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నానని చెబుతూ పసుపు రైతులకు అర్వింద్ కీలక హామీ ఇచ్చారు. తాను రాజకీయాల నుండి తప్పుకునే లోపు పసుపు పంటకు క్వింటాల్‌కు రూ.30,000 మద్దతు ధర కల్పించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పసుపు బోర్డు సాధించామని గుర్తు చేశారు. రైతు ప్రయోజనాల కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. జగిత్యాల సభలో కేసీఆర్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. రైతుల పక్షాన పోరాడే ఏకైక శక్తి బీజేపీ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్, కేసీఆర్ ఉంటేనే వినోదం..
కేసీఆర్ వ్యక్తిగత అంశాలపై స్పందిస్తూ అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ఉంటేనే రాజకీయాల్లో వినోదం ఉంటుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. అయితే కేసీఆర్ తన కళ్ళతోనే బీఆర్ఎస్ పార్టీ అంతం కావడం చూడాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని వెల్లడించారు. ఆ సమయం అతి త్వరలోనే రాబోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను ఆయన బిడ్డ కవిత, కుమారుడు కేటీఆర్ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. వారిద్దరికీ ఫ్లైట్ టికెట్లు ఇచ్చి అమెరికా పంపించేస్తే కేసీఆర్ దరిద్రంతో పాటు తెలంగాణ దరిద్రం కూడా వదులుతుందని తీవ్రస్థాయిలో విమర్శించారు.
బిఆర్ఎస్ ఉనికి కోల్పోతోంది
కేసీఆర్ గ్లామర్ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఇక తెలంగాణ కోసం కొట్లాడాల్సిన అవసరం లేదని.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. రైతుల గోడు వినే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని పూర్తిగా కోల్పోతోందని విశ్లేషించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉందని అర్వింద్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
ALSO READ: సమర్ధులను ఎన్నుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుంది : సీఎం చంద్రబాబు