క్రైం మిర్రర్ : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై విద్యుత్ శాఖ డీఈ ముత్యం వెంకట రమణను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు సంబంధించిన నివాసం, కార్యాలయాలతో పాటు బంధువులు, అనుచరులు, బినామీలకు చెందిన ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో మొత్తం 9 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు, విలువైన వస్తువులు గుర్తించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు వెల్లడించారు.
సోదాల్లో భాగంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో నాలుగు ఫ్లాట్లు, అంజనేయనగర్‌లో జీ+3 కమర్షియల్ భవనం, గుత్తాల బేగంపేటలో జీ+5 కమర్షియల్ భవనాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే వెంకట రమణ భార్య పేరుతో నమోదైన నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది.
అంజనేయనగర్, మూసాపేట్ ప్రాంతాల్లో 10 అపార్ట్‌మెంట్ నిర్మాణాలు చేపట్టినట్లు, వాటి విలువ సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసినట్లు అధికారులు వెల్లడించారు. సోదాల్లో బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.52.02 లక్షల నగదు, 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అదేవిధంగా కియా, మహీంద్రా, బలెనో కార్లు సహా మూడు వాహనాలు, సుమారు రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, 19 విదేశీ మద్యం సీసాలు, ఒక ఐఎంఎఫ్‌ఎల్ మద్యం సీసాను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
వెంకట రమణ గతంలోనూ ఏసీబీ కేసులో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. 2019లో రూ.25 వేల లంచం తీసుకుంటూ ట్రాప్‌లో పట్టుబడ్డారని, ఆ కేసులో ఛార్జ్‌షీట్ కూడా దాఖలైందని వెల్లడించారు. అప్పటి కేసులో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువను కలిపితే మొత్తం అక్రమ ఆస్తుల విలువ సుమారు రూ.28.14 కోట్లకు చేరినట్లు ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
also read :పగతోనే రౌడీ షీటర్ హత్య.. 24 గంటల్లో ముగ్గురు అరెస్ట్