కొన్ని కథలు మనసును తాకడమే కాదు… మన ఆలోచనా విధానాన్ని కూడా మార్చేస్తాయి. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యజమాని తన డ్రైవర్‌ను ఎలా చూస్తాడన్న విషయం వేలాది మందిని ఆలోచింపజేస్తోంది.
ఒకరోజు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ డ్రైవర్, ప్రముఖ వైద్యుడిని సంప్రదించాడు. అతనికి బైపాస్ సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయిస్తే లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా కూడా చేయించుకోవచ్చని సూచించారు.
కానీ అదే రోజు సాయంత్రం, రోగి కుటుంబ సభ్యులు డాక్టర్‌ను సంప్రదించి… ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఆపరేషన్ చేయించాలని, ఖర్చు కొంత తగ్గించేలా సహాయం చేయాలని కోరారు. వైద్యుడు కూడా అందుకు అంగీకరించారు.
మరుసటి రోజే ఆ డ్రైవర్ యజమాని, ఎలాంటి ఆలస్యం చేయకుండా శస్త్రచికిత్సకు కావాల్సిన మొత్తం డబ్బును నేరుగా ఆసుపత్రి ఖాతాలో జమ చేశారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యాక డాక్టర్ ఆయనకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అయితే, ఆ ఫోన్ కాల్లో జరిగిన చిన్న సంభాషణ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
డాక్టర్ కృతజ్ఞతలు తెలపగా… ఆ యజమాని, “నా సహోద్యోగిని మీరు బాగా చూసుకున్నందుకు ధన్యవాదాలు” అని స్పందించారు. అది విన్న డాక్టర్ కాసేపు ఆశ్చర్యపోయారు. “అయన మీ దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తారనే కదా?” అని అడగగా… యజమాని ఇచ్చిన ఆన్సర్ ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునేలా ఉంది.
“మేమిద్దరం కలిసి చాలా కాలంగా పని చేస్తున్నాం. నేను ఒక పని చేస్తాను… ఆయన మరో పని చేస్తారు. బాధ్యతలు వేరు… కానీ మేమిద్దరం ఒకే టీమ్‌లో భాగం. అందుకే ఆయనను నేను డ్రైవర్‌గా కాదు… సహోద్యోగిగా చూస్తాను,” అని ఎంతో గౌరవంగా చెప్పారు.
ఈ మాట విన్న తర్వాత వైద్యుడు కాసేపు మాట రాక నిలిచిపోయాడట. ఈ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ… మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని గౌరవంతో చూడాలని, వారి కృషి కూడా మన జీవితంలో ఎంతో కీలకమని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ సంఘటనపై నెటిజన్లు కూడా హృదయపూర్వకంగా స్పందిస్తున్నారు. కొందరు తమ దగ్గర పనిచేసే వారికి భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేస్తున్నామని చెబుతుండగా… మరికొందరు “ఉద్యోగం కాదు… మనిషే ముఖ్యం”, “గౌరవం ఉంటేనే సంబంధాలు నిలుస్తాయి” అంటూ అభిప్రాయపడుతున్నారు.
also read: జైలులో పెళ్లి.. యావజ్జీవ ఖైదీల ప్రేమకు చట్టబద్ధ ముద్ర