హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. 2026 ఏడాది మొదటి అర్ధభాగంలో నగరంలో ఇళ్లు, ప్లాట్ల కొనుగోళ్లు ఊహించని రీతిలో పుంజుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఈ ఆరు నెలల కాలంలో హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 37,992 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 36,213 రిజిస్ట్రేషన్లతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధిని సూచిస్తోంది. ఐటీ రంగ విస్తరణ, మౌలిక వసతుల కల్పన వంటి సానుకూల అంశాలు నగర రియాల్టీకి మరింత బూస్ట్ ఇచ్చాయి.ఈ రిజిస్ట్రేషన్ల జోరుతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. గత ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఏకంగా 4,118 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాది వసూలైన రాబడితో పోలిస్తే ఇది ఏకంగా 52 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేయడం విశేషం. జూన్ నెలలో ప్రభుత్వం భూముల ప్రభుత్వ విలువల సవరణ చేపట్టబోతుందనే ముందస్తు అంచనాలతో, మే నెలలోనే అత్యధిక సంఖ్యలో కొనుగోలుదారులు తమ రిజిస్ట్రేషన్లను ముగించుకోవడం కూడా ఈ ఆదాయ విప్లవానికి ఒక ప్రధాన కారణమైంది.
Also Read:నియంత్రణ, బాధ్యత లోపిస్తే కేరీర్ క్షణాల్లో మాయం….! ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతమే ఒక పాఠం….
నెలవారీ విశ్లేషణను పరిశీలిస్తే.. మే 2026 నెల మార్కెట్ చరిత్రలోనే అత్యంత కీలకమైన మైలురాయిగా నిలిచింది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 8,344 రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే 33 శాతం కంటే ఎక్కువ వృద్ధి. అయితే, మే నెలలో ముందస్తుగా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరగడం , జూన్ 5 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమలులోకి రావడంతో.. జూన్ నెలలో మార్కెట్ స్వల్పంగా నెమ్మదించింది. గత ఏడాది జూన్‌లో 6,391 రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఈ ఏడాది జూన్ నాటికి అది స్వల్పంగా తగ్గి 5,560 కి చేరింది.ఈ నివేదికలో గమనించాల్సిన మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ప్రీమియం హౌసింగ్ వైపు వేగంగా మళ్లుతోంది. మొత్తం మార్కెట్ వాటాలో ఈ కేటగిరీ ఇళ్లే ఏకంగా 26 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి. మరోవైపు, ఒకప్పుడు మార్కెట్‌ను శాసించిన ₹25 లక్షల లోపు ఉండే బడ్జెట్ ఇళ్లు , ప్లాట్ల కొనుగోళ్లు క్రమంగా క్షీణించడం.. హైదరాబాద్ కొనుగోలుదారుల మారుతున్న ప్రాధాన్యతలను , పెరిగిన కొనుగోలు శక్తిని స్పష్టం చేస్తోంది.
Also Read:గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం – బాణాసంచా యూనిట్‌లో పేలుడు, 10 మంది మృతి