Homeఆంధ్ర ప్రదేశ్పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స – పదేళ్ల నొప్పికి చెక్, కుడి భుజానికి ఆపరేషన్ విజయవంతం

పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స – పదేళ్ల నొప్పికి చెక్, కుడి భుజానికి ఆపరేషన్ విజయవంతం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. శనివారం ఉదయం వైద్యుల పర్యవేక్షణలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయానికి ఆపరేషన్ నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగినట్లు వైద్యులు వెల్లడించారు.

రెండు భుజాల్లో తీవ్ర గాయాలు

పవన్ కళ్యాణ్‌కు రెండు భుజాల్లోనూ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు ఇటీవల వైద్య పరీక్షల్లో బయటపడింది. ఒకేసారి రెండు భుజాలకు శస్త్రచికిత్స చేస్తే తీవ్ర నొప్పి ఉంటుందని వైద్యులు సూచించడంతో ముందుగా కుడి భుజానికి ఆపరేషన్ చేశారు. మిగతా భుజానికి రెండు నెలల తరువాత శస్త్రచికిత్స చేయనున్నారు.

పదేళ్లుగా నొప్పిని భరిస్తూ…

పవన్ కళ్యాణ్‌కు 2016లోనే భుజానికి గాయాలు అయ్యాయి. ఆ సమయంలో వైద్యులు విశ్రాంతి అవసరం అని సూచించినప్పటికీ ఆయన రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా 2018లో జరిగిన పోరాట యాత్రలో అభిమానులు, పార్టీ శ్రేణులు దగ్గరగా రావాలనే ఉత్సాహంతో ఆయన చేతులు పట్టి లాగడం, కరచాలనం చేయడం వల్ల గాయాలు మరింత తీవ్రమయ్యాయి. అప్పటికీ నొప్పిని సహిస్తూ తన కార్యకలాపాలను కొనసాగించారు.

ఎన్నికలు, యాత్రల్లో మరింత ఒత్తిడి

2019 ఎన్నికల తరువాత రైతుల సమస్యలు తెలుసుకునే పర్యటనలు, అలాగే ఇటీవల జరిగిన వారాహి యాత్రల సమయంలో కూడా అభిమానుల రద్దీ కారణంగా భుజాలపై ఒత్తిడి పెరిగింది. కరచాలనం, హత్తుకోవడం వంటి సందర్భాల్లో గాయాలు మళ్లీ మళ్లీ ప్రభావం చూపినప్పటికీ ఆయన చికిత్సను వాయిదా వేశారు.

వైద్యుల సూచనతో శస్త్రచికిత్స

ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో భుజాల్లో మజిల్ టేర్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు. గాయాల తీవ్రత చూసి వైద్యులు ఆశ్చర్యపడి వెంటనే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు పూర్తిచేసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యిందని, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. త్వరలోనే కోలుకుని మళ్లీ ప్రజా సేవలోకి రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

also read: పెళ్లైనా ఆగని భార్య ప్రేమ వ్యవహారం… మనస్థాపంతో భర్త ఆత్మహత్య

1 COMMENT

Comments are closed.

తాజావార్తలు