హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: టాలీవుడ్ దర్శకుడు జి. అశోక్ బాబు చట్టపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని హామీ ఇచ్చి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలతో ఆయనపై సైబరాబాద్ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW)లో కేసు నమోదైంది. బాధితుడి తండ్రి హనుమంతరావు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫిర్యాదు వివరాల ప్రకారం, తన కుమారుడిని హీరోగా లాంచ్ చేస్తానని దర్శకుడు జి. అశోక్ బాబు నమ్మకం కల్పించారని, సినిమా నిర్మాణం కోసం పలు దఫాలుగా మొత్తం రూ.3.5 కోట్లు తీసుకున్నారని హనుమంతరావు ఆరోపించారు. అయితే ఇచ్చిన హామీ మేరకు సినిమా ప్రారంభించకపోగా, తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:Nitin Gadkari: ఇథనాల్ ఫ్యూయెల్ తో మైలేజీ తగ్గుతుందా? నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్..
ఈ వ్యవహారంలో నిర్మాత విజయలక్ష్మి పేరును కూడా ఫిర్యాదులో చేర్చినట్లు తెలుస్తోంది. ఫిర్యాదును స్వీకరించిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా దర్శకుడు అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మిని హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. జి. అశోక్ బాబు టాలీవుడ్‌లో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆకాశ రామన్నతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, పిల్ల జమిందార్, సుకుమారుడు, చిత్రాంగధ, భాగమతి వంటి చిత్రాలను రూపొందించారు. భాగమతి హిందీ రీమేక్‌కూ ఆయనే దర్శకత్వం వహించారు.
Also Read:Bhagyashri Borse: రామ్‌తో ప్రేమాయణం.. అసలు విషయం చెప్పేసిన క్యూట్ బ్యూటీ!
ఈ కేసులో ఆరోపణలు రుజువయ్యే వరకు అవి ఆరోపణలుగానే పరిగణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పోలీసులు ఆర్థిక లావాదేవీలు, సంబంధిత పత్రాలు, ఇరువర్గాల వాంగ్మూలాలను సేకరిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది