పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్ (E-20) శాతం పెంచితే వాహనాలకు నష్టం జరుగుతుందనే ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా స్పందించారు. ఇథనాల్ కారణంగా వాహనాలు దెబ్బతింటాయనే ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇథనాల్‌లో ఉండే కలోరిఫిక్ వాల్యూ పెట్రోల్‌తో పోలిస్తే కొంత తక్కువగా ఉంటుందని గడ్కరీ తెలిపారు. అందువల్ల ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగితే వాహనాల మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉండొచ్చని అంగీకరించారు. అయితే ఆ తగ్గుదల చాలా పరిమితంగానే ఉంటుందని, దాని వల్ల వాహనాల ఇంజిన్,ఇతర భాగాలకు ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. హైఇథనాల్ బ్లెండ్ ఉపయోగిస్తున్న వాహనాలపై ఇప్పటికే పలు పరీక్షలు నిర్వహించామని, వాటిలో వాహనాలు దెబ్బతిన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ-20 ఇంధనం వల్ల దెబ్బతిన్న ఒక్క వాహనాన్నైనా చూపించాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిని గడ్కరీ సవాల్ చేశారు.
ప్రస్తుతం భారత్ ప్రతి ఏడాది సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన పెట్రోలియం, బొగ్గు, సహజవాయువు వంటి శిలాజ ఇంధనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని ఆయన తెలిపారు. ఈ ఇంధనాల వినియోగం వల్లే కాలుష్యం కూడా ఎక్కువగా పెరుగుతోందని చెప్పారు. అందుకే దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ ఇంధనాల వినియోగాన్ని పెంచడం అవసరమని వివరించారు.
ఇథనాల్ వినియోగంపై సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని ప్రచారాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని గడ్కరీ విమర్శించారు. బ్రెజిల్లో 1970ల నుంచే అధిక ఇథనాల్ మిశ్రమంతో కూడిన ఇంధనాన్ని విజయవంతంగా ఉపయోగిస్తున్నారని గుర్తుచేశారు. అలాగే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన అన్నారు.