Crime Mirror, AP State News: ఏపీలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కొద్దిరోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు సన్న హాలు చేస్తోంది. రాష్ట్రంలో నవంబరులోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నామని, నాయకులు సిద్ధంగా ఉండడంతోపాటు క్యాడర్‌ను సిద్ధం చేసుకోవాలని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేడర్ కు సూచించారు.
తాజాగా ఆయన చేసిన ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై మరోసారి చర్చ ప్రారంభమైంది. రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగిసి సుమారు మూడు నెలలు కావస్తోంది. ప్రస్తుతం ఎంపీటీసీల పదవీకాలం మాత్రమే రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉంది. మరో రెండు నెలల్లో ఎంపీటీసీలు పదవీకాలం కూడా ముగుస్తుంది.
దీంతో స్థానిక ప్రజా ప్రతినిధుల పదవీకాలం మొత్తం ముగిసినట్టు అవుతుంది. దీంతో కొత్త పాలకవర్గాల ఎన్నికలకు అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తుంది. అందులో భాగంగానే ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లే ఉద్దేశంతో ఈ మేరకు వరుసగా ప్రభుత్వ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రిందట సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ ఆ పార్టీకి చెందిన కేడర్ కు ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా లోకల్ బాడీ ఎన్నికలపై స్పష్టత ఇవ్వడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో ఆశావాహులు కూడా తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా విజయవాడలోనే ప్రముఖ హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.
దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన లోతైన అంశాలను చర్చించారు. సమాచార సేకరణ కమిటీలు, లీగల్ విభాగం వైఫల్యాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలను పవన్ చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టతను డిప్యూటీ సీఎం తమ పార్టీ నాయకులకు ఇచ్చారు.
-
లీగల్ టీం పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్..
జనసేన లీగల్ విభాగం పనితీరు పట్ల డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు సక్రమంగా లేదని, దానిని మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయాలని, న్యాయ పరిధికి లోబడి కౌంటర్‌లు ఇవ్వాలని సూచించారు. సుగాలి ప్రీతి, ప్రశ్న రావణ్ అంశాలను పవన్ ప్రస్తావించారు. సుగాలి ప్రీతి విషయంలో ప్రభుత్వం తరఫున తాను ఎంతో చేశానని గుర్తు చేశారు.
ఈ విషయాన్ని పార్టీ నాయకులు చెప్పడంలో విఫలమయ్యారన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని పవన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో బలంగా నిలబడ్డ ప్రతి వీర మహిళకు, జన సైనికుడికి అండగా నిలవాలన్నారు.
ఇప్పటికే పార్టీ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలిస్తున్నామని, కొద్దిరోజుల్లోనే అర్హులైన వారికి పదవులు కల్పిస్తామని వెల్లడించారు. స్థానిక సంస్థల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో భాగంగా ఉంచడంపై దృష్టి సారించాలని నాయకులకు ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్న నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలో పార్టీని మరింత బలంగా తయారు చేయాలని కూడా ఆయన సూచించినట్లు తెలుస్తోంది.