Homeక్రైమ్ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే హత్య చేయించిన కూతురు.!

ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే హత్య చేయించిన కూతురు.!

  • ఉద్యోగం కోసం కన్నతల్లికే మరణశాసనం..!

  • ప్రమాదం అనుకున్నారు.. సీసీటీవీ చూస్తే హత్యగా తేలింది

  • రూ.7 లక్షల సుపారీతో తల్లిని చంపించిందనే ఆరోపణలు

  • ఆస్తి.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యమా?

  • కూతురు సహా ఏడుగురి అరెస్ట్‌తో రాజస్థాన్‌లో సంచలనం

క్రైమ్ మిర్రర్ : తన పిల్లలు బాగుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. వారి భవిష్యత్తు కోసం తన జీవితాన్ని ధారపోస్తుంది. కానీ అదే బిడ్డ తన ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ తన ఆస్తిపై కన్నేసి చివరకు కన్నతల్లినే అడ్డుగా భావిస్తే..? ఈ ప్రశ్నకే సమాజం ఉలిక్కిపడేలా చేసిన ఓ దారుణ ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. జైపూర్‌లోని కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్‌గా పనిచేస్తున్న 45 ఏళ్ల నీరజ్ శర్మ జూలై 3న తన కుమారుడిని కోచింగ్ సెంటర్‌లో దింపి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. రోజూ వెళ్లే దారి… సాధారణ ప్రయాణమే. మరికొద్ది క్షణాల్లో తన జీవితమే ముగిసిపోతుందని ఆమె ఊహించి ఉండరు.

ప్రతాప్ నగర్ ప్రాంతంలో వెళ్తున్న నీరజ్ శర్మను అత్యంత వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాహనాన్ని నడిపిన వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. మొదట అందరూ దీనిని ఘోర రోడ్డు ప్రమాదంగానే భావించారు. కుటుంబంలో విషాదం నెలకొంది. కానీ పోలీసులకు కొన్ని అనుమానాలు కలిగాయి. ప్రమాదం జరిగిన తీరు, వాహనం వచ్చిన వేగం, ఢీకొట్టిన విధానం వారిని ఆలోచింపజేశాయి.

  • అక్కడి నుంచే అసలు కథ మొదలైంది.

పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఒక్కో ఆధారాన్ని కలిపారు. అనుమానితులను ప్రశ్నించారు. చివరకు బయటపడిన విషయాలు పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేసినట్లు సమాచారం. ఈ ఘటన ప్రమాదం కాదని, పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు అనుమానించి దర్యాప్తును విస్తరించారు. విచారణలో నీరజ్ శర్మ కుమార్తె ఆయుషి శర్మ పేరు తెరపైకి వచ్చింది. తన తల్లిని హత్య చేయించేందుకు రూ.7 లక్షలకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

తండ్రి మరణించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం తనకు వస్తుందని ఆయుషి భావించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే నీరజ్ శర్మ ఉద్యోగాన్ని కొనసాగించాలని నిర్ణయించుకోవడంతో తల్లి, కూతుళ్ల మధ్య విభేదాలు పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. కాలక్రమంలో ఆ విభేదాలు తీవ్ర రూపం దాల్చాయని, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆస్తి అంశం కూడా ఈ హత్య పథకం వెనుక కారణంగా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిని తన భవిష్యత్తుకు అడ్డుగా భావించిన కూతురు, బంధువులతో కలిసి హత్యకు పథకం వేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం.

తనను జన్మనిచ్చిన తల్లే… తన ఉద్యోగానికి అడ్డుగా కనిపించిందా? చిన్నప్పుడు చేయిపట్టి నడిపించిన అమ్మే… ఆస్తికి అడ్డంకిగా మారిందా? చివరకు డబ్బు, ఉద్యోగం ముందు మాతృబంధం కూడా ఓడిపోయిందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే స్థానికులను కలచివేస్తున్నాయి. ఈ కేసులో కూతురు ఆయుషితో పాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలో కూడా ఉద్యోగం విషయంలో తల్లి, కూతుళ్ల మధ్య గొడవలు జరిగాయని, బెదిరింపులు కూడా ఉన్నాయని కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక రోడ్డు ప్రమాదంగా మొదలైన కేసు… సీసీటీవీ దృశ్యాలతో అనుమానాస్పద మలుపు తిరిగి… చివరకు కన్నతల్లి హత్యకు కూతురే కుట్ర పన్నిందనే ఆరోపణలతో సంచలనంగా మారింది. ఉద్యోగం సంపాదించుకోవడానికి అర్హత కావాలి… ఆస్తిని సంపాదించడానికి శ్రమ కావాలి… కానీ వాటి కోసం కన్నతల్లి ప్రాణాలనే బలితీసుకున్నారనే ఆరోపణలు నిజమైతే, అంతకంటే విషాదకరమైన పతనం మరొకటి ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు