-
సరూర్నగర్ సబ్ పోస్టాఫీసులో రెండు రోజులుగా ప్రజల అవస్థలు
-
రెండు రోజులుగా స్తంభించిన ఇంటర్నెట్ సేవలు..
-
పట్టించుకోని అధికారులు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : సరూర్నగర్ సబ్ పోస్టాఫీసులో గత రెండు రోజులుగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పీడ్ పోస్టు, రిజిస్టర్డ్ పోస్టు, మనీ ఆర్డర్, పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ లావాదేవీలు, ఆధార్ సేవలు, ఇతర ఆన్లైన్ పోస్టల్ సేవలు నిలిచిపోవడంతో పనుల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు.
రోజువారీగా వందలాది మంది పోస్టాఫీసుకు వివిధ అవసరాల కోసం వస్తుండగా, ఇంటర్నెట్ సమస్య కారణంగా సేవలు అందక విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, వ్యాపారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కోర్టు, విద్య, ఉద్యోగాలకు సంబంధించిన అత్యవసర రిజిస్టర్డ్ పోస్టులు, స్పీడ్ పోస్టులు పంపాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమస్యపై సిబ్బందిని ప్రశ్నిస్తే, “ఇంటర్నెట్ సాంకేతిక సమస్య కారణంగా సేవలు నిలిచిపోయాయి” అని చెబుతున్నప్పటికీ, రెండు రోజులుగా సమస్య పరిష్కారం కాకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో పోస్టాఫీసుకు వచ్చిన వారు పనులు పూర్తి కాక వెనుదిరుగుతున్నారు.
-
ప్రజల డిమాండ్..
సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇంటర్నెట్ సమస్యను పరిష్కరించి పోస్టల్ సేవలను పునరుద్ధరించాలని, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు రాకుండా ప్రత్యామ్నాయ ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ సమస్యతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.