క్రైమ్ మిర్రర్: వి.కోటలో జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురైన ఘటన ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలరేపింది. ఈ రోజు ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్ వచ్చి జగన్‌ను కత్తులతో విచక్షణ రహితంగా నరికి చంపారు. అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు పాల్పడింది రౌడీ షీటర్ తమీమ్‌గా గుర్తించారు. తమీమ్‌కు మరో వ్యక్తి సాయపడినట్టు పోలీసులు వెల్లడించారు. తమీమ్‌ది వి.కోట అయినప్పటికీ ప్రస్తుతం కర్ణాటకలో నివాసం ఉంటున్నాడు. మృతుడు జగన్మోహన్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
హత్యను ఖండించిన జర్నలిస్టు సంఘాలు…
జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిచాయి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటన సిగ్గుచేటు కలిగించే చర్యగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం తిరుపతి జిల్లా సభ్యులు అరవ గోపాల్ అన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించి పరిష్కరించుకోవాల్సిన మార్గాలు చాలా ఉన్నాయని… అలా కాదని దుర్మార్గమైన, దుహంకారమైన ఆలోచనలతో తోటి మనిషిని చంపడం బాధాకరమన్నారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తోటి విలేకరి చనిపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ‘ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ పోరం’ తరఫున అరవ గోపాల్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.