క్రైమ్ మిర్రర్ : తండ్రి అనే బంధానికే మచ్చ తెచ్చే ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. కన్న కూతురిపైనే ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని వికారాబాద్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వికారాబాద్ టౌన్ సీఐ రఘుకుమార్ వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణానికి చెందిన 44 ఏళ్ల జగన్నాథ్ తన 14 ఏళ్ల కుమార్తెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలికకు ఈ నెల 27న కడుపునొప్పి రావడంతో పాఠశాల ఉపాధ్యాయురాలికి విషయం చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయురాలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాలికను కౌన్సెలింగ్ చేసి వివరాలు తెలుసుకోగా, ఆమె తన తండ్రే ఏడాది కాలంగా బెదిరింపులకు గురిచేస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 245/2026 కింద పోక్సో చట్టం, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆమెకు అవసరమైన రక్షణ, కౌన్సెలింగ్, సహాయం అందించేందుకు భరోసా కేంద్రానికి తరలించారు.
కేసు నమోదు అనంతరం నిందితుడు పరారీలోకి వెళ్లగా, అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. గురువారం నిందితుడు తన ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం అతడిని రిమాండ్‌కు పంపింది. దర్యాప్తులో నిందితుడికి ఇద్దరు భార్యలు ఉన్నట్లు తెలిసింది. మొదటి భార్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉండగా, రెండో భార్యకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో భార్య మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పిల్లలందరూ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నట్లు వెల్లడించారు.
చిన్నారులపై ఎక్కడైనా లైంగిక వేధింపులు లేదా దాడులు జరిగినట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
also read : ఆస్తి వివాదం.. మహిళను హత్య చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు అరెస్ట్
