క్రైమ్ మిర్రర్ : కుటుంబ జీవితం అనూహ్య మలుపు తిరిగిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. వివాహిత అయిన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోగా, నాలుగు నెలల పాటు ఆమె కోసం వెతికిన భర్త చివరకు ఇద్దరినీ గుర్తించాడు. అయితే భార్య తిరిగి తనతో రావడానికి నిరాకరించడంతో, పరిస్థితిని అర్థం చేసుకున్న భర్త స్వయంగా ఆమెకు ప్రియుడితో వివాహం జరిపించడం చర్చనీయాంశమైంది. స్థానికుల కథనం ప్రకారం.. చందౌలీ జిల్లాకు చెందిన జీవనాథ్ రాజ్‌భర్ ఉపాధి కోసం ఢిల్లీలో వెల్డర్‌గా పనిచేస్తుండగా, అతని భార్య సరిత ముగ్గురు పిల్లలతో స్వగ్రామంలో నివసిస్తోంది. ఈ క్రమంలో రైళ్లలో వేరుశనగలు విక్రయించే అజయ్ అనే యువకుడితో సరితకు పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఆ పరిచయం సాన్నిహిత్యంగా మారి, ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడినట్లు సమాచారం.
కొంతకాలం తర్వాత సరిత తన ముగ్గురు పిల్లలను ఇంట్లోనే వదిలి అజయ్‌తో కలిసి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్త జీవనాథ్ భార్య ఆచూకీ కోసం బంధువులు, పరిచయస్తులు, పలు ప్రాంతాల్లో దాదాపు నాలుగు నెలల పాటు గాలించాడు. చివరకు స్థానిక రైల్వే స్టేషన్‌లో సరిత, అజయ్ కలిసి కనిపించడంతో వారిని కలిసి మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తనతో తిరిగి ఇంటికి రావాలని భార్యను ఎంతగా కోరినా, ఆమె అంగీకరించలేదు. ఇకపై అజయ్‌తోనే జీవితం కొనసాగిస్తానని స్పష్టం చేసింది. భార్య నిర్ణయం మారే పరిస్థితి లేదని గ్రహించిన జీవనాథ్, వివాదాలను మరింత పెంచకుండా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సరిత, అజయ్‌లను మ్యారేజ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లి, తన సమక్షంలోనే వారి వివాహం జరిగేలా సహకరించాడు.
అనంతరం మాట్లాడుతూ, “ఆమె నాతో కలిసి జీవించాలని నేను కోరుకున్నాను. కానీ ఆమె ఇష్టం వేరేలా ఉంటే బలవంతం చేయడం సరైంది కాదు” అని తెలిపాడు. ఇక సరిత మాత్రం తమ దాంపత్య జీవితం విఫలం కావడానికి భర్తే కారణమని ఆరోపించింది. ఉపాధి కోసం బయట ఉండే భర్త కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బు పంపించేవాడు కాదని, అదే విషయంపై తరచూ గొడవలు జరిగేవని ఆమె పేర్కొంది. ఆ విభేదాలే చివరకు తనను అజయ్‌కు దగ్గర చేశాయని తెలిపింది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, దంపతుల నిర్ణయాలు, కుటుంబ పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
also read : యూనిఫామ్ ముసుగులో దారుణం.. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కానిస్టేబుల్
