విజయనగరం, క్రైమ్ మిర్రర్: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే నలుగురు మృతి చెందిన ఘటన ప్రాంతంలో విషాదం నెలకొంది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వేగంగా వెళ్తున్న ఒక కారు, పూసపాటిరేగ మండలం పేరాపురం జంక్షన్ వద్దకు చేరుకోగానే అదుపు తప్పింది. ఆ సమయంలో పేరాపురం దగ్గర రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఢీకొట్టగా, వారు అక్కడిక్కడే మృతిచెందారు. వెనువెంటనే లారీని ఢీకొనడంతో కారు డ్రైవర్ సహా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.