•పాజిటివ్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నంలో కమిషనర్ రంగనాథ్
•కేవలం కూల్చివేతలే కాదు.. పునర్నిర్మాణం దిశగా..
•సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:- హైడ్రాకు పాజిటివ్ ఇమేజ్ తెచ్చే ప్రయత్నంలో ఉన్నారా? ప్రతికూలతల నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ ఆలోచన మారిందా? హైడ్రా పై ఉన్న అపవాదులను, విమర్శలను చెక్ పెట్టాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కేవలం ఒక ఐపీఎస్ అధికారి మాత్రమే కాదు. ఒక వ్యవస్థకు ప్రజాదరణ ఎలా తీసుకురావాలో తెలిసిన మేధావి అని ప్రస్తుతం అందరూ కీర్తిస్తున్నారు. కొత్త కొత్తలో చెరువుల ఆక్రమణల తొలగింపుతో రంగనాథ్ ఒక హీరోలా కనిపించారు. ఎప్పుడైతే మధ్యతరగతి వారి నివాసాలను కూల్చడం ప్రారంభించారో అప్పటినుంచి ఇమేజ్ పడిపోతూ వచ్చింది. బాధితుల కన్నీళ్లు, రాజకీయ విమర్శలు హైడ్రా ప్రతిష్టను మరింత ప్రశ్నార్ధకంగా మార్చాయి. ఈ ప్రతికూలతను గమనించిన రంగనాథ్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం ప్రారంభించారు. హైడ్రా అనేది కేవలం కూల్చే వ్యవస్థ గానే కాకుండా.. పునర్నిర్మాణం జరిపి ఆదుకునే వ్యవస్థగా హైడ్రాను తీర్చిదిద్దే పనిలో పడ్డారు. నిజంగా ఈ విషయంలో ఏవి రంగనాథ్ వ్యవహార శైలికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఈగల్ టీం లోకి ట్రాన్స్ జెండర్లు..
ట్రాన్స్ జెండర్ లను ఏకంగా ఈగల్ టీంలో చేర్చుకోవడం గొప్ప విషయం. సమాజంలో వివక్షకు గురవుతున్న వారికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా హైడ్రాకు అపారమైన పాజిటివ్ మైలేజ్ తెచ్చారు. ఇది కేవలం ఒక ఉద్యోగ నియామకం మాత్రమే కాదు. జాతీయస్థాయిలో కూడా దీనిపై చర్చ జరిగింది. సామాజిక సంస్కరణగా ఈ పరిణామం గుర్తించబడుతోంది. కూల్చివేతలతో వచ్చిన నిరంకు సముద్రను ఈ ఒక్క నిర్ణయంతో మానవతాముద్రగా మార్చేయడంలో రంగనాథ్ సక్సెస్ అయ్యారు. దీనివల్ల సామాన్య ప్రజల్లో కూడా హైడ్రా పై సానుకూలత పెరిగింది.
పబ్లిక్ రిలేషన్స్ తో..
హైడ్రా అనేది ఒక భారీ ప్రాజెక్ట్. ఎన్నెన్నో ప్రతికూలతలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని రంగనాథ్ గుర్తించారు. సోషల్ మీడియాతో పాటు పబ్లిక్ రిలేషన్ షిప్ మేనేజ్మెంట్ను ఆయన సరికొత్తగా వాడుకుంటున్నారు. హైడ్రా పనితీరును పారదర్శకంగా ఉంచుతూనే.. దాని వెనుక ఉన్న ప్రజా ప్రయోజనాన్ని సమాజం గుర్తించేలా చేస్తున్నారు. చెరువుల పునరుద్ధరణ ఫోటోలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా హైడ్రా సమాజ హితం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రంగనాథ్.