క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతమైన 12 ఏళ్ల పాలనా స్ఫూర్తిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్వచ్ఛ పాఠశాల అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పరిశుభ్రంగా ఉండేలా శుభ్రతా చర్యలు చేపట్టారు. ఈ పిలుపులో భాగంగా ఇవాళ ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేంద్రమంత్రి చేరుకున్నారు. అక్కడ ఆయన స్వయంగా చీపురు పట్టి తరగతి గదులను ఊడ్చారు. ఆపై వాటర్ పైపు చేతబట్టి బెంచీలు, టేబుళ్ల కింద ఉన్న దుమ్ము, ధూళిని కడిగిపారేశారు. క్లాస్ రూమ్‌లోని మూలమూలకు వెళ్లి మగ్గు, బకెట్ సహాయంతో క్లీన్ చేసి గదులను అద్దంలా మెరిపించారు.
మంత్రి స్వయంగా బడిని శుభ్రం చేయడం చూసి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆశ్చర్యపోయారు. బండి సంజయ్ ఇచ్చిన పిలుపుతో నియోజకవర్గవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు తమ సొంత ఖర్చులతో చీపుర్లు, బకెట్లు కొనుగోలు చేసి ప్రభుత్వ స్కూళ్లను శుభ్రం చేసే మహా యజ్ఞంలో భాగస్వాములయ్యారు. దీనికోసం ముందురోజే నియోజకవర్గంలో టిఫిన్ బైఠక్ నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో రాజకీయాలు చూడకూడదన్నారు. దేశవ్యాప్తంగా మోదీ 12 ఏళ్ల పాలనపై ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. కానీ కరీంనగర్‌లో వినూత్నంగా మన పిల్లలు చదువుకునే బడులను బాగు చేసుకోవాలని సంకల్పించామన్నారు. ఈ స్ఫూర్తిదాయక కార్యక్రమానికి టీచర్లు, విద్యార్థులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా సహకరిస్తున్నారన్నారు.
కేవలం శుభ్రం చేయడమే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి ఎల్లుండి నుంచి గ్రామాలు, మండలాల్లో భారీ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతి కోసం మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఈసారి కూడా ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. టెన్త్ విద్యార్థులందరి విద్యాభారాన్ని తగ్గించేందుకు, తన కేంద్ర మంత్రి వేతనం నుంచి వారి పదో తరగతి బోర్డు పరీక్ష ఫీజులను పూర్తిగా తానే చెల్లిస్తానని బండి సంజయ్ ప్రకటన చేశారు. త్వరలోనే నియోజకవర్గంలోని స్కూళ్ల సమస్యలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, కేంద్ర నిధుల ద్వారా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.