హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా కోర్ సిటీ పరిధిలోని నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్ మార్గాల్లో నిత్యం నరకంగా మారుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి సరికొత్త ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. పబ్లిక్ గార్డెన్ నుంచి అసెంబ్లీ వెనుక వైపుగా లక్డీకాపూల్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవున ఆంగ్ల అక్షరం ‘Y’ (వై) ఆకారంలో నిర్మించ తలపెట్టిన ఈ వంతెనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రణాళికలు, డిజైన్లను సిద్ధం చేసింది.సాధారణంగా నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణాల సమయంలో ప్రైవేటు ఆస్తుల సేకరణ పెద్ద సవాలుగా మారుతోంది. భూసేకరణ కారణంగా కోర్టు కేసులు, పరిహారం వివాదాలు తలెత్తి ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ఆలస్యం అవుతున్నాయి.
Also Read:New Diesel Rules: డీజిల్‌పై కేంద్రం కొత్త ఆంక్షలు.. ఇక రోజుకు ఎన్ని లీటర్లు పోస్తారంటే?
ఈ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రతిపాదిత వంతెనను గరిష్ఠంగా ప్రభుత్వ భూముల్లోనే నిర్మించేలా అధికారులు చాకచక్యంగా ప్లాన్ చేశారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో హెచ్ఎండీఏ ఇప్పటికే సమగ్ర సర్వేను పూర్తి చేసింది. దాదాపు 99 శాతం వరకు ప్రభుత్వ ఆస్తులను కేటాయించింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్తుల అవసరం ఎక్కువగా లేకుండా, ఎక్కడా వివాదాలకు తావులేకుండా ఈ ఫ్లైఓవర్ అలైన్‌మెంట్‌ను రూపొందించింది.ఈ ప్రతిపాదిత ఫ్లైఓవర్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ముందు భాగం నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి పబ్లిక్ గార్డెన్ మీదుగా, అసెంబ్లీ వెనుక వైపు నుంచి రైల్వే లైన్ వెంబడి ముందుకు సాగుతుంది. లక్డీకాపూల్ వద్దకు చేరుకోగానే ఈ వంతెన రైల్వే లైన్ మీదుగా ప్రయాణించి లక్డీకాపూల్ జంక్షన్‌ను దాటుతుంది. ఇక్కడే అసలు ఇంజినీరింగ్ అద్భుతం జరగనుంది.
Also Read:Katrina Kaif: ‘చాందినీ బార్ 2’లో కత్రినా కైఫ్.. అభిమానులకు పండగే!
జంక్షన్ దాటిన తర్వాత ఈ ఫ్లైఓవర్ రెండుగా చీలిపోతుంది. అంటే ‘వై’ షేప్‌గా మారుతుంది. ఇందులో ఒక మార్గం నేరుగా మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే రహదారికి, మరో మార్గం ఖైరతాబాద్ వైపు వెళ్లే రహదారికి అనుసంధానం అవుతుంది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కంటే ముందే లక్డీకాపూల్ ప్రధాన రహదారిపై ఈ వంతెన ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేశారు.హైదరాబాద్-విజయవాడ రహదారికి అనుసంధానంగా ఉండే ఈ కోర్ సిటీ రూట్‌లో భారీ వాహనాల రాకపోకల వల్ల రాత్రి వేళల్లోనూ తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో విధించే ఆంక్షల వల్ల వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.
Also Read:రమేష్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ నాయకులు – రూ.10 వేల ఆర్థిక సహాయం..! —
ఈ కొత్త వంతెన అందుబాటులోకి వస్తే నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు ఖైరతాబాద్ లేదా మాసబ్ ట్యాంక్ వైపు సిగ్నల్ ఫ్రీగా వెళ్లవచ్చు. అయితే, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా దీనిని పూర్తిగా ‘వన్-వే’గా మార్చనున్నారు. నాంపల్లి నుంచి వెళ్లే వాహనాలకు మాత్రమే దీనిపై అనుమతి ఉంటుంది. ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్ నుంచి వచ్చే వాహనాలను దీనిపైకి అనుమతించరు.