-
తెలంగాణ సీఎం రేవంత్ ను పక్కన పెడితే..
-
కేటీఆర్ సరికొత్త గేమ్
-
గత అనుభవాల దృష్ట్యా నమ్మని కాంగ్రెస్ హై కమాండ్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీ కాంగ్రెస్ కు దగ్గర అవుతోందా? ఆ మేరకు కేటీఆర్ సంకేతాలు పంపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీని, గాంధీభవన్ సంస్కృతిని తీవ్రంగా నిందించేవారు కేటీఆర్. ఇప్పుడు వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ.. రాహుల్ గాంధీకి పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా ఆయన సంధిస్తున్న అస్త్రాల్లో అంతర్గత సందేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ ను రాహుల్ కీలుబొమ్మ, అన్లిమిటెడ్ ఏటీఎం అంటూ నిందిస్తూనే.. ఆయనను కంట్రోల్ చేయాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తులు చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
గతంలో గాంధీభవన్లో గాడ్సే తిరుగుతున్నాడు అంటూ కేటీఆర్ సెటైరికల్ గా మాట్లాడారు. గాంధీభవన్ మంచిదే కానీ.. అక్కడ కూర్చున్న రేవంత్ రెడ్డి మాత్రమే చెడ్డవాడన్నట్టు చిత్రీకరిస్తూ.. కేటీఆర్ చేసిన ఆరోపణల వెనుక బలమైన వ్యూహం ఉంది. రేవంత్ రెడ్డిని ఏకాకిని చేసి పక్కన పెట్టించాలన్నది కేటీఆర్ తాజా ఎత్తుగడగా అర్థం అవుతోంది.
-
గతంలో చాలా సార్లు..
రేవంత్ విషయంలో కేటీఆర్ ఇటువంటి రాజకీయ వ్యూహాలు చాలాసార్లు అమలు చేశారు. గతంలో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించవద్దని.. ఆయన చేతికి పగ్గాలు వెళ్లకుండా అడ్డుకోవాలని అధికారంలో ఉన్న గులాబీ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు.
రేవంత్ పీసీసీ రేసులో తెరపైకి వచ్చిన ప్రతిసారి ఆయనపై వరుసగా కేసులు బనాయించడం, జైలుకు పంపి రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చూడడం వంటి అణచివేత చర్యలు నడిచాయి. కానీ ఆ వ్యూహాలేవీ ఫలించలేదు. రేవంత్ అన్ని అడ్డంకులను అధిగమించి పిసిసి అధ్యక్షుడు అయ్యారు.
అటు తరువాత గులాబీ పార్టీ పదేళ్ల కోటను బద్దలు కొట్టి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. నాడు రేవంత్ ఎదుగుదలను అడ్డుకోలేకపోయిన కేటీఆర్.. నేడు అధికారం కోల్పోయాక సరికొత్త రూటు ఎంచుకున్నారు.
రేవంత్ ని తప్పిస్తే లేదా ఆయన దూకుడుకు కళ్లెం వేస్తే.. భవిష్యత్తులో తాము కేంద్రంలో కాంగ్రెస్తో సఖ్యతగా ఉండేందుకు.. లేకుంటే దగ్గర అయ్యేందుకు అభ్యంతరం లేదన్న సంకేతాలను ఢిల్లీ అధిష్టానానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.
-
దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్..
అయితే గత పరిణామాల దృష్ట్యా కేటీఆర్ మైండ్ గేమ్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే అవకాశం లేదు. గతంలో కెసిఆర్ ఆడిన మైండ్ గేమ్ తో కాంగ్రెస్ దారుణంగా దెబ్బతింది. గులాబీ పార్టీతోపాటు కేసీఆర్ నుంచి ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా కీర్తించి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తామని నాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నారు.
అసలు తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేయాలని చూశారు. అలాంటి చరిత్రను రాహుల్ గాంధీ కానీ.. కాంగ్రెస్ సాయి కమాండ్ కానీ అంత తేలిగ్గా మర్చిపోతాయని ఎవరూ భావించడం లేదు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు.
ఇండియా కూటమికి రాజకీయంగా అండగా నిలుస్తున్న ఒక మాస్ లీడర్. అలాంటి నాయకుడిని వదులుకొని.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకు ప్రయత్నించిన గులాబీ పార్టీ మాటలను హై కమాండ్ నమ్మే అవకాశం లేదని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది.
అయితే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులను రేవంత్ పై ఎగదోయడం ద్వారా రేవంత్ ను ఇబ్బందుల్లో పెట్టాలని చూస్తున్నారు కేటీఆర్. చూడాలి మరి ఏం జరుగుతుందో..
